మంత్రి హరీశ్‌ రాకతో గ్రామం పరిశుభ్రం

ఒకే రోజు 120 ట్రాక్టర్ల చెత్త తొలిగించిన గ్రామస్తులు
సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌లో మంత్రి పర్యటన
సిద్ధిపేట,జనవరి7(జనంసాక్షి): ఆర్ధిక మంత్రి హరీశ్‌ రావు రాకతో ఆ గ్రామం పరిశుభ్రంగా మారిపోయింది. రోడ్డు పక్కన దర్శనమిచ్చే చెత్తకుప్పలు మాయమైపోయాయి. రోడ్ల పక్కన పెంచిన మొక్కలకు రక్షణ ఏర్పాటుచేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. సిద్ధిపేట రూరల్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామంలో మంగళవారం రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి మంత్రి  హాజరయ్యారు. గ్రామస్తుల సహకారంతో అధికారులు 120 ట్రాక్టర్ల చెత్తను తొలగించారు.  ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఇంటింటికీ త్వరలోనే రెండు చెత్త డబ్బాలు పంపిణీ చేస్తామన్నారు.  మన ఊరుని  మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, పనికి రాని చెత్త ఇంట్లో పెట్టుకోవద్దని సూచించారు.  జ్వరాలు లేని ఆరోగ్య వెంకటాపూర్‌, ఆరోగ్య సిద్ధిపేట నియోజకవర్గం, ఆరోగ్య తెలంగాణ కావాలని ఇదంతా ప్రజల చేతుల్లోనే ఉందని చెప్పారు. రజక సంఘం, కుమ్మరి సంఘ కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణం, సీసీ రోడ్లు, మోరీలు కొత్త బ్జడెట్లో మంజూరు చేస్తానని హావిూనిచ్చారు. గతంలోనే విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ మంజూరు చేసుకున్నామని, స్మశాన వాటికలో  నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలోనే కాలువల ద్వారా  వెంకటాపూర్‌ గ్రామానికి గోదావరి జలాలు రానున్నాయని., యాసంగి పంటకు నీరు అందుతుందని వెల్లడించారు. సంప్రదాయేతర పంటల వైపు దృష్టి సారించాలని, అందరూ వరి పంట వేయొద్దని., ఆరుతడి పంటలు వేయాలని., రెండవ పంట
లాభదాయకంగా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించారు. నెల రోజుల్లో సిద్ధిపేటకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని, రెండు పంటలు పండించి వెంకటాపూర్‌ గ్రామం సస్యశ్యామలం అవుతుందని మంత్రి చెప్పారు.  ఇంటింటికీ మరుగుదొడ్లు అందరూ వాడాలని, ప్రతి ఇంటి ముందు చెట్లు పెంచాలని, ఎన్ని మొక్కలు కావాలన్నా.. పంపిస్తామని తెలిపారు.