మళ్లీ చలిపులి పంజా

పడిపోతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి : తెలుగు రాష్టాల్ల్రో మరోమారు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌లలో చలి తీవ్రత పెరిగింది. విశాఖ మన్యంలో కూడా చలి పెరిగింది. హైదరాబాద్‌ నగరంలో శీతల గాలులు వణికిస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నా.. చలి తీవ్రత ఎక్కువ ఉంటోంది. పొడి వాతావరణం నెలకొంది. ఇంచుమించు ఇదే స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు అల్పపీడన ప్రభావంతో కనిష్ఠం 21 డిగ్రీల వరకు నమోదైనా.. రెండు రోజుల వ్యవధిలోనే ఆరు డిగ్రీలు పడిపోయింది. దీంతో రాత్రి, ఉదయం వేళల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. శివారు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువే ఉంది. ఇక్కడ సాధారణం కంటే రెండు డిగ్రీల వరకు తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. విశాఖపట్నం
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయిలో నమోదు అవుతున్నాయి. ఏజెన్సీలో చలి తీవ్రత పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అమ్మవారిపాదాలు, లంబసింగి, పాడేరు, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.