మహిళలకు భరోసాగా దిశ చట్టం

దిశ అత్యాచారం,హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేళ తాజాగా దీనిపై ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. హైకోర్టు,సుప్రీం కోర్టుల్లో ఎన్‌కౌంటర్‌పై విచారణ సాగుతోంది. ఈ దశలో ఎపి సర్కార్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుని దిశ చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఇలాంటి చొరవ తీసుకుని ఓ పటిష్ట చట్టం తీసుకుని రావడం నిజంగా అభినందనీయం. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు కఠిన శిక్షలు పడేలా చూడాలని.సత్వర శిక్షలు అమలు చేయాలని యావత్‌ దేశం కోరుకుంటున్న వేళ ఎపి సిర్కార్‌ దిశ చట్టాన్ని రూపొందించడం హర్షణీయం.మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా దఙవ చట్టాన్ని రూపొందించారు. దీనిని నిర్దారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలపడం ద్వారా దేశానికి ఎపి ఆదర్శంగా నిలిచింది. ఏపీ క్రిమినల్‌ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడితే అతి త్వరగా నిందితులకు మరణశిక్ష పడేలా చట్టం తీసుకొచ్చింది. ఇటువంటి కేసుల్లో నిందితులను దోషులుగా నిర్థారించే ఆధారాలున్నప్పుడు మూడు వారాల్లోగా అంటే 21 వర్కింగ్‌ డేస్‌ ల్లో తీర్పు వచ్చేలా క్రిమినల్‌ లా చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం పలికింది. ఇటువంటి కేసుల్లో వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి..14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి..మొత్తం 21 రోజుల్లో కోర్టుల్లో తీర్పు వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో ప్రస్తుతం అత్యాచారాల కేసుల్లో నాలుగు నెలల్లోగా తీర్పు రావాలనే ఉంది. దీన్ని నాలుగు నెలల నుంచి 21 రోజులకు కుదిస్తూ చేసిన బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం పలికింది. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలోను ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయం జరిగింది. అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక ఘటనల్లో నేరాల విచారణకు ప్రతి జిల్లాల్లోను ప్రత్యే కోర్టుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అంతేకాదు సోషల్‌ విూడియా వేధికగా బాధిత మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలకు అడ్డుకట్టవేసేలా కేబినెట్‌ నిర్ణయించింది. మహిళలను కించపరిచేలా చేస్తున్న చర్యల్ని ఖండించింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగ్‌ లు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపనుంది. కేంద్రం కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకుని రావడం ద్వారా దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా సవరణ చట్టం-2019 కి సంబంధించిన ఆంధప్రదేశ్‌ దిశ యాక్ట్‌ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ చట్టంలో భాగంగా మహిళలు,చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడాలంటే హడలెత్తేలా కొత్తచట్టం తీసుకొస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హావిూకి అనుగుణంగా ‘ఏపీ దిశ’ చట్టాన్ని రూపొందించారు. ఆడవాళ్లపై అకృత్యాలు జరిగిన వెంటనే ఉపశమనం కలిగే చట్టం రావాలని తల్లిదండ్రులు, ప్రతి మహిళ, చెల్లి, ప్రతి ఇంట్లోని ఆడపిల్ల ఎదురు చూస్తోంది. ఈ దశలో ఇలాంటి కఠిన చట్టం తీసుకుని రావాలని నిర్ణయం తీసుకుని, అందుకు అనుగుణంగా ఈ కొత్త చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ దిశ చట్టంతో పాటు మహిళలు,

చిన్నారుల భద్రత కోసం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో అదనంగా 354(ఇ), 354 (ఎఫ్‌) సెక్షన్లను చేర్చే ముసాయిదా బిల్లులకు కూడా కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఎపి ప్రబుత్వం కఠిన చట్టంతో మహిళలకు భరోసా ఇస్తోంది. ఎమ్మెల్యే రోజా అన్నట్లుగా మహిళాంద్రప్రదేశ్‌గా ఎపి చరిత్రలో నిలబడ నుంది. నిజంగా ఇలాంటి చట్టాలు తీసుకుని వచ్చి, దుండగులను కఠినంగా అణచివేస్తే తప్ప మహిళలకు రక్షణ ఉండదు. ఏపీ కేబినెట్‌ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీలో దిశ చట్టాన్ని అభినంది స్తున్నట్లు నటుడు చిరంజీవి ప్రకటించారు. దిశా చట్టంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినంద నీయమని మహిళా సవఘాలు కూడా ప్రకటించాయి. లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు, చిన్నారులకు ఈ చట్టం భరోసా కల్పిస్తుందన్నారు. సత్వర న్యాయం కోసం తొలి అడుగులు పడటం హర్షణీయమన్నారు. నేరం మొదటిసారి చేస్తే.. రెండేళ్ల జైలు శిక్ష, రెండోసారి చేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష పడేలా కఠిన నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పిల్లలపై లైంగిక వేధింపులు, నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) సెక్షన్‌ కింద ఐదేళ్ల నుంచి పదేళ్ల పాటు జైలుశిక్ష..పోక్సో చట్టం కింద ఇప్పటి వరకూ 3 నుంచి ఐదేళ్లు జైలు శిక్ష ఉన్న ఈ శిక్షను పెంచుతూ బిల్లులోని అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇవన్నీ అమల్లోకి రానున్నాయి. కఠిన చట్టాలు అవసరమన్నది గుర్తించి దనీఇకి దిశ చట్టంగా తీసుకుని రావడం మంచి నిర్ణయంగా చూడాలి. రాష్టాల్ల్రో కాకుండా కేంద్రమే ఇలాంటి కఠిన చట్టాలు తీసుకుని వచ్చి ఆదర్శంగా నిలవాలి. అప్పుడే మహిళలకుభరోసా ఉంటుంది.