మహిళలను దారుణంగా కడతేర్చిన సైకో అరెస్టు

16 హత్యలు
వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌
హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి): ఏకంగా పదహారు మంది మహిళలను దారుణంగా కడతేర్చిన కరుడుగట్టిన హంతకుడిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, రాచకొండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితుడు మైన రాములును అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ విూడియాకు వెల్లడించారు. నిందితుడు రాములు  నిందితులు పురుషోత్తమ నాయుడు,16 మందిని దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారణ అయిందని సీపీ తెలిపారు. ఈ 16 హత్యల్లో చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నందున మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతానికి తెలియలేదన్నారు. నిందితుడు రాములుపై మెదక్‌, సైబరాబాద్‌, రాచకొండ ప్రాంతాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.సీపీ అంజనీకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ”నిందితుడు మైన రాములు దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నిందితుడు హైదరాబాద్‌లోని బొరబండలో నివాసముంటున్నాడు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా కందిలో ఉండేవాడు. గతంలో రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు కేసుల్లో 21 సార్లు రాములు అరెస్టయ్యాడు. అందులో పదహారు హత్య కేసులు కాగా.. నాలుగు చోరీ కేసులు, ఓసారి పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నందుకు కేసు నమోదైంది. వీటిలో ఒక కేసులో రాములుకు జీవిత ఖైదు విధించారు. అనంతరం పెరోల్‌పై బయటకి వచ్చాడు. నిందితుడు మైన రాములు తాజాగా రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అందులో ఒకటి ములుగు పీఎస్‌ పరిధిలో ఉండగా.. మరొకటి ఘట్‌కేసర్‌ పరిధిలో నమోదైంది. నిందితుడు రాములు 2003 నుంచి హత్యలు, చోరీలు చేయండం మొదలుపెట్టాడు. అతడి చేతిలో ఇప్పటివరకు హత్యకుగురైన వారందరూ మహిళలే. రాష్ట్రంలోని తూప్రాన్‌, సంగారెడ్డి, రాయదుర్గం, దుండిగల్‌, నర్సాపూర్‌, నార్సింగి, కూకట్‌పల్లి, బోయిన్‌పల్లి, చందానగర్‌, శావిూర్‌పేట, పటాన్‌చెరు పోలీసుస్టేషన్ల పరిధిలో ఆ హత్య కేసులు నమోదయ్యాయి. శావిూర్‌పేట, మేడ్చల్‌, రాయదుర్గం, ఐడీఏ బొల్లారంలో చోరీ కేసులు నమోదయ్యాయి” అని సీపీ వివరించారు. నిందితుడిని పట్టుకునేందుకు కృషి చేసిన రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీసులను సీపీ అంజనీ కుమార్‌ అభినందించారు.