మహిళ ప్రాణం తీసిన డాక్టర్ల నిర్లక్ష్యం

సర్జరీ సమయంలో కడుపులో దూదితోనే కుట్లు
కడుపులో దూదితో ఏడాదిగా కడుపునొప్పితో మహిళ మృతి
ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన బంధువులు
భువనగిరి,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాలను బలిగొన్నది. కాన్పుకు వచ్చిన మహిళ కాటికి వెళ్లింది. ఏడాది పాపను అనాథ చేసింది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన ఓ గర్భిణి కాన్పు నిమిత్తం.. ఏడాది క్రితం భువనగిరి కేకే ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమెకు వైద్యులు సర్జరీ నిర్వహించి డెలివరీ చేశారు. ప్రసవం తర్వాత ఆ మహిళ కడుపునొప్పితో బాధపడిరది. క్రమక్రమంగా ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండటంతో.. ఇటీవలే చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు అన్ని రకాల మెడికల్‌ టెస్టులు నిర్వహించగా, కడుపులో దూది ఉన్నట్లు గుర్తించారు. తొలికాన్పు సమయంలో ఆమె కడుపులో దూది అలానే ఉంచి, మరిచిపోయి కుట్లు వేశారు. ఆ దూది అలాగే ఉండటంతో పేగులు దెబ్బతిని తీవ్రమైన కడుపునొప్పికి కారణమైంది. హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రిలో బాధిత మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమెకు తొలి కాన్పు చేసిన భువనగిరి కేకే ఆస్పత్రి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. మహిళ మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు.