మానకొండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చెట్టును వేగంగా ఢీకొన్న కారుఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం

ఘటనపై దిగ్భార్రతి వ్యక్తం చేసిన కెటిఆర్‌, వినోద్‌

కరీంనగర్‌,నవంబర్‌26 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి మానకొండూరు పోలీస్‌ స్టేషన్‌ సవిూపంలో చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కరీంనగర్‌లోని దవాఖానకు తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.మృతులు కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన కొప్పుల శ్రీనివాసరావు, బాలజీ శ్రీధర్‌, జలంధర్‌, శ్రీరాజ్‌గా, గాయపడిన వ్యక్తిని పెంచాల సుధాకర్‌ రావుగా గుర్తించారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరులో దశ దినకర్మకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కొప్పుల శ్రీనివాసరావు సిరిసిల్లలో పంచాయతీరాజ్‌ ఈఈగా పనిచేస్తున్నారు.ఈ శ్రీనివాస రావు మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని హావిూ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈ శ్రీనివాస్‌ రావు సహా నలుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.