ఆస్పత్రి రోగులను సైతం వదిలిపెట్టని జీఎస్టీ


` సామాన్యుల నడ్డీ విరుస్తున్న వస్తు,‘సేవ’లపన్ను
` ప్యాక్‌చేసి లేబుల్‌ వేస్తే ఇకమోతే..
` నూతన జీఎస్‌టీ రేట్లు అమల్లోకి రావడంతో భగ్గుమన్న నిత్యావసరాల ధరలు
` ఇంతవరకు జీఎస్టీ పరిధిలోకి రాని వస్తువులపైనా పన్ను బాదుడు
` కొన్నింటికి కొత్తగా రేట్లు వర్తింప జేయగా..మరికొన్ని వేరేస్లాబులోకి.
` దీంతో మరింతగా పెగిరిన వస్తువుల ధరలు
` పెరిగిన రేట్లపై విపక్షాల ఆగ్రహం
` ‘మళ్లీ గబ్బర్‌సింగ్‌ స్ట్రైక్స్‌’ అని రాహుల్‌ ఎద్దేవా..
` ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతున్నారంటూ మండిపాటు
` పెరిగిన రేట్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌
న్యూఢల్లీి(జనంసాక్షి): ఇంతవరకు జీఎస్టీ పరిధిలోకి రాని కొన్ని వస్తువులపై పన్ను బాదుడు మొదలైంది. ప్యాక్‌ చేసి లేబుల్‌ వేసిన పెరుగు, మజ్జిగ, పన్నీరు, లస్సీ వంటి పాల ఉత్పత్తుల ధరలు జీఎస్టీ కారణంగా పెరిగాయి. కొన్ని వస్తువులకు కొత్తగా రేట్లు వర్తింప జేయగా మరికొన్ని వస్తువులను వేరే స్లాబ్‌ రేటులోకి మార్చారు. దీంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా వినియోగదారులు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలపై పన్ను భారాలు మోపుతూ తాజా జీఎస్‌టీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో మోదీ సర్కార్‌పై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. ఓవైపు అధిక పన్నులతో నడ్డివిరుస్తూ మరోవైపు నిత్యావసరాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లను పెంచిందని ఢల్లీి సీఎం, ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. పెరిగిన జీఎస్‌టీ రేట్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిత్యం వాడే ఆహారోత్పత్తులు, నిత్యావసరాలపై పన్ను భారం తగదని మండిపడ్డారు. పెరుగుతున్న ధరల నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలతో ఢల్లీి ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటోందని అన్నారు. కాగా, నూతన జీఎస్‌టీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో పలు ఆహారోత్పత్తులు, వస్తువులు, సేవల ధరలు భారమయ్యాయి.ప్రీ ప్యాక్డ్‌, ప్యాకేజ్‌డ్‌ ఆహోరోత్పత్తులపై కస్టమర్లు అధిక మొత్తం చెల్లించాల్సి రాగా నిర్ధిష్ట వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్‌టీ రేట్లు పెరగడంతో నిత్యావసరాల ధరలూ భగ్గుమంటున్నాయి. హోటల్‌ రూంలు, బ్యాంక్‌ సేవలు భారమయ్యాయి. ఇక బియ్యం, గోధుమలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్‌, బెల్లం, తేనె, సోలార్‌ వాటర్‌ హీటర్లపై 5 శాతం నుంచి 18 శాతం జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇక ఎలక్ట్రానిక్‌ వాహనాలపై జీఎస్‌టీ రేటు 5 శాతం తగ్గడం ఒక్కటే కొంత ఊరట కలిగిస్తోంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్‌లో నిర్ణయాలకు అనుగుణంగా తాజా జీఎస్‌టీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
మళ్లీ గబ్బర్‌సింగ్‌ స్ట్రైక్స్‌.. జీఎస్టీ రేట్ల పెంపుపై రాహుల్‌ ఫైర్‌
ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతున్నారంటూ కేంద్రంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు.ప్రజలపై అధిక పన్నులు, నిరుద్యోగం అంశాలపై తాజాగా మరోసారి మండిపడ్డారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను భాజపా నాశనం చేసిందని ఆరోపించారు. నేటి నుంచి ఏయే వస్తువులు ప్రియం కానున్నాయో ఓ గ్రాఫ్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. జీఎస్టీని గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌గా అభివర్ణించిన రాహుల్‌..పెరుగు, పన్నీర్‌, బియ్యం, గోధుమలు, బార్లీ, బెల్లం, తేనె వంటి నిత్యావసర వస్తువులపై కేంద్రం జీఎస్టీ విధించడంపై మండిపడ్డారు. ప్రజలు విరివిగా వాడే ఇలాంటి వస్తువులపై గతంలో ఎలాంటి పన్నులూ లేవన్నారు. మళ్లీ గబ్బర్‌సింగ్‌ స్ట్రైక్స్‌ అని పేర్కొంటూ ‘’అధిక పన్నులే.. ఉద్యోగాల్లేవ్‌.. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలనే దానిపై భాజపా గొప్ప నైపుణ్యత కలిగి ఉంది’’ అని ట్విటర్‌ వేదికగా విమర్శించారు.