మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం..:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా బిఎస్పీ అధ్యక్షుడు ఎం.వి.గుణ ను పరామర్శించిన అనంతరం ఆసుపత్రిని పరిశీలించారు. రోగులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదన్నారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారన్నారని అన్నారు. వడదెబ్బకు గురైన రోగులను కూడా ఆరుబయటే బెడ్ వేసి వైద్యం చేయడం దుర్మార్గమని అన్నారు. గర్భిణులు,వృద్ధులు గంటల తరబడి వేచి చూస్తున్నారని అన్నారు.రాత్రి వేళలో డాక్టర్లు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఆసుపత్రిలో మహిళలు,పురుషులకు ఒకే వార్డును కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.తక్షణమే ఆసుపత్రి సూపరిండెంట్ పురుషులు,మహిళలకు వేర్వేరుగా వార్డులు కేటాయించాలని డిమాండ్ చేశారు.రాత్రి వేళలో రోగులు సహాయకులు ఆరు బయట పడుకోవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆసుపత్రి మరుగుదొడ్లు నిర్వహణ లేక దుర్వాసన వేదజల్లుతున్నాయని అన్నారు.ఆసుపత్రి పరిశుభ్రతను పాటించే ఏజెన్సీలు స్థానిక ఎమ్మెల్యే అనుచరులకు చెందినవిగా ఆరోపించారు.ఆసుపత్రిలో రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి పూర్తిగా విఫలమాయ్యారని విమర్శించారు.