మేడారం జాతరకు ఏర్పాట్లు చేయండి

వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు ప్రతిపాదనలు
అధికారులతో సవిూక్షలో మంత్రి సత్యవతి ఆదేశాలు
ములుగు,సెప్టెంబర్‌21 (జనంసాక్షి)  మేడారం జాతర ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16, 17, 18, 19 తేదీల్లో జరిగే సమ్మక్క`సారలమ్మ జాతర పనుల కోసం శాశ్వత ప్రాతిపదికన నాణ్యమైన పనులు చేసేందుకు వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన మంగళవారం వారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం సమ్మక్క`సారలమ్మ జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ రెండేండ్లకు ఒకసారి జరుపుకునే మేడారం సమ్మక్క `సారలమ్మ జాతర ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలన్నారు. ముఖ్యంగా మేడారానికి వచ్చే అన్ని రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. వర్షాలతో దెబ్బతిన్న రహదారుల నిర్మాణ పనుల కోసం ప్రతిపాదనలు అందించాలన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనంగా తాగునీరు, వసతి, విద్యుత్తు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించేందుకు తాత్కాలిక, శాశ్వత పద్ధతిలో ప్రతిపాదనలు పంపించాలని కోరారు.
రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో భక్తుల తాకిడి పెరగనుందని, రామప్ప అభివృద్ధికి పనులు సత్వరం చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. యునెస్కో గుర్తింపుతో రామప్పకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. రామప్ప నుంచి విడుదలయ్యే నీటిని ఆలయ అభివృద్ధి కోసం చేపట్టే నిర్మాణాలకు మోరంచవాగులోకి మళ్లించే విధంగా ఇరిగేషన్‌
అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిచాలన్నారు. రూ.40 కోట్ల నిధులతో జంగాలపల్లి ఎక్స్‌ రోడ్‌ నుంచి రామప్ప గుడి వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. దేవాదాయశాఖ ద్వారా చేపట్టిన భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని చెప్పారు. జంపన్న వాగు వద్ద నీటి ప్రవాహంతో ప్రమాదాలు జరగకుండా వాగు అభివృద్ధి పనులు చేపట్టాలని, స్నాన
ఘట్టాలు, దుస్తులు మార్చుకొనే గదులను నిర్మించాలని అన్నారు. పారిశుధ్య పనులపై కార్యాచరణ రూపొందించాలని, కొవిడ్‌ నేపథ్యంలో భక్తులకు వైద్య సేవలను అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. గిరిజన సంప్రదాయాలకు విఘాతం కలగకుండా ఆలయ పూజారులతో సమన్వయం చేసుకొని ఆలయ పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. మేడారంతో పాటు కొండాయి, పునుగుండ్ల గుడుల వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తోపాటు గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ గతంలో నిర్వహించిన మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో తెలంగాణ స్టేట్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌కు చెందిన 23 ఎకరాల స్థలంలో కొంత భాగాన్ని పర్యాటక రంగ అభివృద్ధికి ఉపయోగించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఆలయన అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ విజయవంతంగా జరుగుతుందని, వారం రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని వివరించారు.
ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం రామప్ప వైపు చూస్తుందని, ప్రభుత్వం రామప్ప అభివృద్ధి కోసం తీసుకుంటున్న పనులను అధికారులు మనసుపెట్టి పూర్తిచేయాలన్నారు. ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ మాట్లాడుతూ మేడారంలో జాతర సందర్భంగా పోలీస్‌ శాఖకు శాశ్వత ఆవాసం లేకపోవడం మూలంగా వర్షాలతో ఇబ్బంది కలుగుతుందన్నారు. పోలీస్‌ శాఖకు మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మాకిడి ఎర్రయ్య, మేడారం ఆలయ కార్యనిర్వాహక అధికారి రాజేందర్‌, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ అప్పయ్య, ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీవో (జనరల్‌) వసంతరావు, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్‌ బి.మణిక్యరావు, పంచాయతీ రాజ్‌ ఈఈ రాంబాబు, టీఎస్‌ ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌, అగ్నిమాపక శాఖ అధికారి బి.మల్లికార్జునయాదవ్‌, టూరిజం అధికారి శివాజీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ హేమలత, విద్యుత్‌, ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌ బీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
““““““““““““““““