యాసంగిపంట కేంద్రం కొంటుందా?లేదా?


` బండి పర్యటనలో ఉద్రిక్తత
` ఐకేపీ సెంటర్‌ వద్ద టిఆర్‌ఎస్‌ నిరసనలు
` కేంద్రంతో ధాన్యం కొనుగోలు ప్రకటన చేయించాలని డిమాండ్‌
నల్లగొండ,నవంబరు 15(జనంసాక్షి): నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి నిరసన సెగ తగిలింది. నల్లగొండ టౌన్‌లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద బండికి రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ధాన్యం సేకరణపై బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ రైతులు ధర్నాకు దిగారు. బండి సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాశులను పరిశీలించడానికి బండి సంజయ్‌ నల్లగొండకు వెళ్లారు. ఈ క్రమంలో రైతులు ఆయనను అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలుపై ఆయనతో వాగ్వాదానికి దిగారు. యాసంగి వడ్లు కొంటామని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇలా నల్గొండ జిల్లాలో బండి సంజయ్‌ టూర్‌ ఉద్రిక్తంగా మారింది.  అటు సంజయ్‌ పర్యటనకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు… రెండు వర్గాలను చెదరగొట్టారు. ఉద్రిక్తతల మధ్యే.. ఆర్జాలబావి ఐకేపీ సెంటర్‌ ను బండి సంజయ్‌ పరిశీలించారు. యాసంగి పంట కొనుగోళ్లపై
ప్రకటన చేసిన తర్వాతే సంజయ్‌ రావాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి సవాల్‌ చేశారు.  కేంద్ర సర్కార్‌ కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చి అన్నదాతలను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ సర్కార్‌ ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు. బండి సంజయ్‌ జనాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.  రానున్న రోజుల్లో జనం తిరగడబడతారని హెచ్చరించారు.  యాసంగి పంటను కొనేలా బండి సంజయ్‌ కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. యాసంగి పంట కొనేలా బండి సంజయ్‌ ని నిలదీయాలని ఎమ్మెల్యే సూచించారు.