రాష్ట్రంలో మూడు జనపనార మిల్లుల ఏర్పాటు


ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడిరచిన మంత్రి కెటిఆర్‌
గోనె సంచుల కొరత తీర్చేందుకే అని వెల్లడి
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వివరణ
హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జనపనార మిల్లును ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలియచేశారు. జనపనార పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకం కల్పిస్తున్నది. రెండు వరి పంటల మధ్యన మూడో పంటగా జనుము పంటను పండిచేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పిస్తుందని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జనపనార మిల్లుల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా గోనె సంచుల కొరత కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. అందుకే అటు మిల్లు ఏర్పాటుతో పాటు, ఇటు జనపనార రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రభాగాన ఉన్నాం. రైతులకు ఇబ్బంది కావొద్దనే ఉద్దేశంతోనే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం సేకరించాం. కానీ సరిపడ గోనె సంచులు లేక ఇబ్బంది పడ్డామని అన్నారు. బెంగాల్‌, బంగ్లాదేశ్‌లో జ్యూట్‌ మిల్స్‌ మూతపడ్డాయి. గొనే సంచులకు విపరీతమైన కొరత వచ్చింది. ఆ సమయంలో తమను సీఎం కేసీఆర్‌ పిలిచి.. మన రాష్ట్రంలోనే గోనె సంచులను ఉత్పత్తి చేసే దిశగా ఆలోచించాలన్నారు. రాయితీలు ఇచ్చి పెట్టుబడులను ఆహ్వానించాలన్నారు. వరంగల్‌ జిల్లాలో గ్లాస్టర్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంబీజీ కమాటెడిస్‌ అనే కంపెనీ, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం అగ్రో కంపెనీ జనపనార మిల్లులను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మూడు కంపెనీలు కలిపి రూ. 887 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. 10,480 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
రైతులు ఉత్పత్తి చేసిన జనుమును ఈ పరిశ్రమలు కొని, వారు ఉత్పత్తి చేసిన గోనే సంచులను ప్రభుత్వం కొనేందుకు ఒక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. మొదటి 7 సంవత్సరాల పాటు వారు ఉత్పత్తి చేసే గోనే సంచులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. 15 కోట్ల గోనే సంచులను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో 27 కోట్ల డిమాండ్‌ ఉంది. జనుము మన దగ్గర పండటం లేదు. బీహార్‌, బంగ్లాదేశ్‌ నుంచి జనుమును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జనుము రవాణాపై సబ్సిడీ కూడా ఇస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా జనుము పంటను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తామన్నారు. జ్యూట్‌ మిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.