రాహుల్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసన

` వయానాడ్‌లో బ్లాక్‌డేగా పాటించిన పార్టీ నేతలు
` ఇక దేశమంతా రాహుల్‌ గొంతుకను వినిపిస్తుంది
` రాహుల్‌ ప్రశ్నలను ప్రజలు ప్రశ్నిస్తుంటారు: ప్రియాంక
న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్‌ అనర్హత వేటుపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. వరుసగా రెండోరోజు కూడా దేశంలోని పలుచోట్ల నిరసనలు వ్యక్తం అయ్యాయి. కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళనలకు దిగారు. ధర్నాలు చేశారు. మోడీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. కోర్టు తీర్పుతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేయడంతో దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాహుల్‌పై అనర్హత వేటు వేడయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రజా స్వామ్యానికి చీకటి రోజు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ శ్రేణులు రాహుల్‌ లోక్‌సభ నియోజకవర్గమైన కేరళ  లోని వయనాడ్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. రోడ్లపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేసారు. రాహుల్‌ గాంధీ నినాదాలతో హెరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వయనాడ్‌ కాంగ్రెస్‌ కమిటీ నేడు శనివారం  బ్లాక్‌డేగా ప్రకటించింది. రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా ఆందోళన చేపడుతున్న కాంగ్రెస్‌ శ్రేణుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనాల్లో ఆయా స్టేషన్లకు తరలిస్తున్నారు. ఒక్క వయనాడ్‌లోనే కాదు.. దేశంలోని పలు రాష్టాల్ల్రో శనివారం కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.
ఇక దేశమంతా రాహుల్‌ గొంతుకను వినిపిస్తుంది:ప్రియాంక
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు ఇక దేశమంతా ప్రతిధ్వనిస్తాయని ఆయన సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ట్విటర్‌ వేదికగా శనివారం ప్రియాంక ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల గొంతుకను అణిచివేయడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్‌ కార్యకలాపాలకు సంబంధించిన వీడియోను ఆమె పోస్టు చేస్తూ..ఈ ప్రశ్నలు వేసినందుకే రాహుల్‌ గాంధీపై దాడి చేశారని ఆమె రాసుకొచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ప్రజల తరఫున ప్రశ్నలు లేవనెత్తితే అదానీ నౌకరు ఆ గొంతును నొక్కివేయడానికి కుట్రపన్నారని ఆమె ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పక తప్పదని ఆమె స్పష్టం చేశారు.శుక్రవారం కూడా ప్రియాంక మోడీ ప్రభుత్వంపై వరుస ట్వీట్లు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక ప్రధాని(రాజీవ్‌ గాంధీ) కుమారుడిని దేశద్రోహి అంటూ మోడీ అనుచరులు నిందించారని ఆమె పేర్కొన్నారు. గాంధీ కుటుంబాన్ని, కశ్మీరు పండిట్లు అందరినీ మోడీ పార్లమెంట్‌లో అవమానించారని ఆమె అన్నారు. అయినప్పటికీ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడలేదని, ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం నుంచి అనర్హుడు కాలేదని ప్రియాంక వ్యాఖ్యానించారు. దేశ పార్లమెంట్‌ కన్నా, ప్రజల కన్నా విూ స్నేహితుడు గౌతమ్‌ అదానీయే గొప్పవాడా అంటూ కూడా ఆమె మోడీని ప్రశ్నించారు.