రైతు బజార్లలో అధిక ధరల మోత

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
ఖమ్మం,నవంబర్‌9 (జనం సాక్షి):   ప్రజలకు తక్కువ ధరలకు తాజా కూరగాయలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజారులు ప్రజలకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, రైతు బజారులోని అధిక ధరలు మరింత భారం మోపుతున్నాయి. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద ఉన్న రైతు బజారుకు నిత్యం 10 వేల మంది వినియోగదారులు కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రైతుబజార్‌లో కొంతమంది దళారులు బోర్డు ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను దోచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  రైతులు సైతం తాము పండించిన కూరగాయలను వినియోగదారులకు నేరుగా అమ్మేందుకు అవకాశం ఇచ్చారు.  అక్కడ కూరగాయలను బోర్డు ధరల ప్రకారమే అమ్మాలి. కానీ.. వ్యాపారులు, కొంతమంది రైతులు బోర్డును పట్టించుకోకుండా బోర్డు ధరల కంటే ఎక్కువకు అమ్ముతూ దందా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజూ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా రైతు బజారు పర్యవేక్షకులు అక్కడ ఏర్పాటు చేసిన ధరల పట్టికపై ధరలు రాస్తూనే ఉంటారు. అయినా.. ఆ ధరల పట్టికతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యాపారులు, కొందరు రైతులు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
రైతు బజార్‌లో బోర్డు ధరల కన్నా అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.  రైతులకు, వినియోగదారులను సమన్వయం చేయాల్సిన అధికారి కనిపించక పోవడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ల్గ/తుబజారులో బోర్డు ధరలకన్నా అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.