రొంపికుంటలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

కమాన్ పూర్, జనం సాక్షి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన మిరాల రాజు గుడిసె ఇల్లు గురువారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది . షార్ట్ సర్క్యూట్ తో మంటలు పూర్తిగా వ్యాపించడం వల్ల ఇంట్లోని గ్యాస్ సిలిండర్ సైతం పేలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న నగదు, బంగారం, గృహపకరణ వస్తువులు, బట్టలు ఇతర సామాగ్రి పూర్తిగా కాలి బూడిద అయిపోయాయి. దీంతో బాధితుడికి సుమారు ఐదు లక్షల పైగా నష్టం వాటిల్లింది. ప్రమాద సమాచారం అందుకున్న గోదావరిఖని ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. భూమి లేని నిరుపేద అయిన తనకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు మిరాల రాజు అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఘటన స్థలాన్ని కమాన్పూర్ తహసిల్దార్ దత్తు ప్రసాద్, గ్రామ సర్పంచ్ కటకం రవీందర్, ఆర్ ఐ సందాని, వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్, కమాన్పూర్ పోలీసు సిబ్బంది తదితరులు సందర్శించారు. ఆర్ ఐ ఘటనపై పంచనామ చేశారు.