వందేళ్లలో మహమ్మారిపై అతిపెద్ద విజయం


వందకోట్ల డోసుల టార్గెట్‌ చేరుకోవడం గర్వం
ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ విశ్రామ్‌ సదన్‌ ప్రారంభించిన మోడీ
న్యూఢల్లీి,అక్టోబర్‌21 (జనంసాక్షి) : వందేళ్ళలో అతి పెద్ద మహమ్మారిపై పోరాటంలో మన దేశానికి 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులతో బలమైన రక్షణ కవచం లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇది అందరి కృషి వల్లనే సాధ్యమయ్యిందని అన్నారు. ఇందుకు కృషి చేసిన వారందరికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ విశ్రామ్‌ సదన్‌ను గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 2021 అక్టోబరు 21 చరిత్రలో ఓ ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుందన్నారు. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్‌ డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికం. న్యూఢల్లీిలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్‌)లోని రaజ్జర్‌ క్యాంపస్‌లో ఉన్న నేషనల్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద నిర్మించిన ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ విశ్రామ్‌ సదన్‌ను మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ప్రత్యేకమైన రోజుగా 2021 అక్టోబరు 21కి స్థానం దక్కిందన్నారు. కాసేపటి క్రితం 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ మైలురాయిని మన దేశం దాటిందన్నారు. 100 ఏళ్ళలో అతి పెద్దదైన మహమ్మారితో పోరాటంలో 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులతో మన దేశానికి బలమైన రక్షణ కవచం లభించిందన్నారు. ఈ విజయం భారత దేశానికి, ప్రతి భారతీయునికి దక్కుతుందని తెలిపారు. దేశంలోని వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు, వ్యాక్సిన్‌ రవాణాలో పాలుపంచు కున్నవారు, వైద్య రంగంలో నిపుణులు, టీకాలు ఇచ్చిన సిబ్బంది, తదితరులందరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. విశ్రామ్‌ సదన్‌ భవనాన్ని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ నిర్మించిందని, విద్యుత్తు, నీరు, భూమి కోసం అయ్యే ఖర్చులను ఎయిమ్స్‌ భరించిందని చెప్పారు. సుధా మూర్తి బృందాన్ని, ఎయిమ్స్‌ మేనేజ్‌మెంట్‌ను అభినందించారు. ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి దేశంలోని కార్పొరేట్‌, ప్రైవేటు రంగాలు, సోషల్‌ ఆర్గనైజేషన్లు నిరంతరం కృషి చేస్తున్నాయన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ 806 పడకల విశ్రామ్‌ సదన్‌ను నిర్మించింది. కేన్సర్‌ రోగులకు పరిచర్యలు చేయడానికి వచ్చేవారికి ఏసీ వసతిని ఇక్కడ కల్పిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.