విజయవంతంగా కొనసాగుతున్న ‘కంటివెలుగు’

` రాష్ట్రంలో ఇప్పటివరకు 88 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు
` రీడిరగ్‌ అద్దాలు 14 లక్షల 69 వేల 533 మందికి పంపిణీ
` 41 రోజుల్లో సుమారు 88 లక్షల 51 వేల 164 మందికి పరీక్షలు
` లక్ష్యంలో 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి
హైదరాబాద్‌ (జనంసాక్షి): కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు  అంధత్వ రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప సంకల్పంతో  జనవరి 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి సమస్యలు దూరమవుతున్నాయని ప్రజలు సంబరపడుతున్నారు. 18 సం.లు పై బడిన వారికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో తీసుకున్న వారు మురిసిపోతున్నారు. కంటి చూపు సరిగ్గా కనిపించక ఇబ్బందులు పడుతున్న మాకు తమ దగ్గరికే వచ్చి  కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి తమ జీవితాల్లో వెలుగు నింపుతున్న ముఖ్యమంత్రి  సల్లగుండాలని తమ దీవెనలిస్తున్నారు. ఈ శిబిరాలకు వచ్చే ప్రజలు ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మంచి కార్యక్రమం అని తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జూన్‌ 15 వరకు కొనసాగించనున్నారు. సెలవు దినాల్లో మినహా సిబ్బంది స్థానికంగానే అందుబాటులో ఉంటూ పరీక్షలు త్వరగా పూర్తిచేసేలా చొరవ చూపుతున్నారు. ఇచ్చిన లక్ష్యాల పూర్తికి కసరత్తు చేస్తున్నారు.
1500 బృందాల ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు 1500 బృందాలతో పాటు బఫర్‌ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అన్ని మండలాలలో, పురపాలికల్లో అవి పనిచేస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను యూనిట్‌ గా తీసుకొని గ్రామాలను ఎంపిక చేశారు. ఆశావర్కర్లు, ఏఎంఎంలు, అధికారులు గ్రామాల్లో జనాభా వారీగా వివరాలు సేకరించి అందుకు అనుగుణంగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు,సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పురపాలిక చైర్మన్‌, కమిషనర్లు, కౌన్సిలర్లు సహాయం తీసుకుంటూ ఆ ప్రాంతంలోని 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ‘‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’’ అంటారు… ఆ కళ్ళు సరిగా లేకపోతే అన్ని సమస్యలే. మన ఇండ్లలో చాలా మంది పెద్దవాళ్ళు, తమకు కంటి సమస్యలు ఉన్నా, చూపు తగ్గినా… ఆ విషయం బయటకు చెప్పరు. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే డబ్బు ఖర్చు అవుతుందని రాజీ పడిపోతారు. ప్రజలకు చాలా మేలు చేసే పథకం కంటి వెలుగు పథకం. ప్రభుత్వం ద్వారా ఉచిత కంటి పరీక్షలతో పాటు, అవసరమైన మందులు, కళ్ళద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు… లక్ష్యంలో 55.79  శాతం పూర్తి:
రాష్ట్రంలో అన్ని గ్రామపంచాయతీలు, పురపాలిక సంఘాల పరిధిలోని అన్ని వార్డుల్లో రెండో విడతలో భాగంగా సుమారు కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలనేది వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లక్ష్యం నిర్ధేశించారు. ఇప్పటి వరకు  88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు చేశారు. 14 లక్షల 69 వేల మందికి ఉచితంగా రీడిరగ్‌ అద్దాలు పంపిణీ చేశారు. ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి చుక్కల మందుతో పాటు ఏ,డి, బి కాంప్లెక్స్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
శిబిరాలు ఎంతో ఉపయోగకరం..
` వల్లందాసు దశరథ, ఆరెగూడెం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా
కళ్ళు సరిగ్గా కనబడనందున చూయించుకునేందుకు కంటి వెలుగు వైద్య శిబిరానికి వచ్చాను. శిబిరాల్లో కంటి పరీక్షలను బాగానే చేస్తున్నారు. నేను కంటి పరీక్షలు చేయించుకున్నాను. గ్రామాల్లో కంటి సమస్యలతో ఎందరో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పేదలకు వరంగా మారింది. మాలాంటి మధ్య తరగతి ప్రజలకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. డాక్టర్లు కళ్లను పరీక్షించి ఉచితంగా అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు నా చూపు మెరుగుపడిరది. అద్దాల నాణ్యత కూడా చాలా బాగుంది.
పరీక్షలు బాగా చేస్తున్నారు..
` భీమిడి మోతమ్మ, ఆరెగూడెం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా.
కంటి సమస్యలతో బాధపడుతూ ప్రయివేటు ఆసుపత్రుల్లో డబ్బులు వెచ్చించి చికిత్స చేయించుకోలేని వారికి సీఎం కేసీఆర్‌ కంటివెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడం హర్షణీయం. గతంలో దూరప్రాంతాలకి వెళ్లి పరీక్షలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం గ్రామాల్లోనే వైద్యుల బృందం కంటి పరీక్షలు మంచిగా చేస్తున్నారు. నాకు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు. అద్దాలు చాలా బాగున్నాయి. మాలాంటి వారికి ఈసేవలు ఎంతో మేలు చేస్తున్నాయి. దూరప్రాంతాలకి వెళ్లి పరీక్షలు చేసుకునే బాధ తప్పింది.
ఇబ్బందులు లేకుండా చర్యలు :
` డా. ఉబ్బు నర్సింహా, వెలిమినేడు పి.హెచ్‌.సి వైద్యాధికారి, చిట్యాల మండలం
కార్యాచరణ ప్రకారంగా పి.హెచ్‌.సి పరిధిలోని గ్రామాల్లో నేత్ర పరీక్షలు చేస్తున్నాం. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజు లక్ష్యం కంటే ఎక్కువగానే పరీక్షలు నిర్వహిస్తున్నాము. అవసరమైనవారికి రీడిరగ్‌ కళ్లద్దాలు వెంటనే ఇస్తున్నాం. ప్రిస్కిప్షన్‌ అద్దాలు కొన్ని రోజులు గడువుపెట్టి బాధితుల ఇంటికి చేరవేస్తున్నాం. కంటి ఆపరేషన్‌ అవసరం ఉన్నవారికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్లు చేసుకోవాలని చెబుతున్నాం.
మహిళలకు బాసటగా ఆరోగ్య కేంద్రాలు
రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా గ్రామ గ్రామాన ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అనే లక్ష్యంతో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించింది. మహిళా ఆరోగ్య కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో మహిళలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్దారణ జరిగిన వారికి తదుపరి చికిత్సను పూర్తి ఉచితంగా అందించేందుకు మహిళా ఆరోగ్య కేంద్రాలు దోహదపడుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలు ఏఎన్‌ఎంలు ఆరోగ్య మహిళా కేంద్రం నిర్వహణ పట్ల విస్తృత ప్రచారం నిర్వహిస్తునారు.  ప్రాథమిక డయాగ్నాస్టిక్‌, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, సూక్ష్మ పోషక లోపాలు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్‌ లు, పి.ఐ.డి., పిసిఓఎస్‌., కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, మెనోపాజ్‌ మేనేజ్‌ మెంట్‌, లైంగిక వ్యాధులు, శరీర బరువు అంశాలు ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే మహిళల వివరాలను ప్రత్యేక యాప్‌ లో పకడ్బందీగా నమోదు చేస్తున్నారు. పల్లెల్లో మహిళలు, మహిళా ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు.