విద్యార్థులు ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌పై ఆర్టీసీ ఎండీ స్పందన

మంచిర్యాల : చెన్నూరు నుంచి కోట‌ప‌ల్లి మోడ‌ల్ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌పై ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్‌కు ఓ ఉపాధ్యాయురాలు ట్వీట్ చేయ‌గా, ఆయ‌న త‌క్ష‌ణ‌మే స్పందించి బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించారు.

కోటపల్లి మోడల్ స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్థుల రవాణా సౌకర్యం పై కస్తూర్భా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి చేసిన ట్విట్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్‌కు దాదాపు 200 మంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఉదయం వేళ‌లో చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్ కి రావడానికి సరైనన్ని బ‌స్సులు లేక‌పోవ‌డంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే మార్గంలో ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్న కోటపల్లి కస్తూర్భా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి విద్యార్థుల సమస్యలను వీడియో తీసి ఆర్టీసీ ఎండీకి ట్విట్ చేశారు.

వెంటనే స్పందించిన సజ్జనార్ ప్రతిరోజు ఉదయం పూట చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం అదనపు బస్ ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఉపాధ్యాయురాలు భార‌తి, కోట‌ప‌ల్లి మోడ‌ల్ స్కూల్ విద్యార్థులు సజ్జ‌నార్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.