విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలి

చౌడాపూర్, ఆగస్టు 5( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్  మండల కేంద్ర పరిధిలోని కన్మన్ కాల్వ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి విద్యుత్ షాక్ తో గొర్రెలు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా చౌడాపూర్ మండల కేంద్రంలో  విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రతిరోజు నిత్యం ఏదో ఒకచోట మూగజీవాలు బలవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే కన్మన్ కాల్వ గ్రామానికి చెందిన నక్క రాజు తన గొర్రెలను మేపుకొని సాయంత్రం వేళా గ్రామానికి వస్తుండగా గ్రామానికి దగ్గరలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు రాగానే  విద్యుత్ షాక్ కొట్టి రెండు గొర్రెలు మృతి చెందాయి.రెండు గొర్రెల విలువ సుమారుగా రూ.20 వేల రూపాయలు ఉంటుందని తన వ్యాపారం గొర్రెలు పెంచుకుని అమ్ముకోవడం అని,గొర్రెలు చనిపోవడం వలన తనకు నష్టం జరిగిందని అందుకు ప్రభుత్వం తనకు నష్టపరిహారం చెల్లించాలని గొర్రెల కాపరి రాజు కోరాడు.