వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలు


21మందికి నియామక పత్రాలు అందించిన కలెక్టర్‌
గుంటూరు,ఆగస్టు 26(జనంసాక్షి): వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తూ కోవిడ్‌ విధుల నిర్వహణలో, ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించారు. ఈ మేరకు 21 మందికి నియామక పత్రాలను జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మరణించిన ఉద్యోగుల కుటుంబీకుల్లో మనోధైర్యం, ఆర్థిక భరోసా కల్పించటానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. 2021 ఫిబ్రవరి నుంచి జిల్లాలో 56 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించామని, 23 మందికి జూనియర్‌ సహాయకులుగా, 19 మందికి టైపిస్టులుగా, 14 మందికి ఆఫీసు సబార్టినేట్స్‌గా, రెవెన్యూ, పోలీసు, స్టేట్‌ట్యాక్స్‌, రిజిస్టేష్రన్‌, ఆడిట్‌, వ్యవసాయ, సర్వే, అటవీ మొదలైన
శాఖల్లో ఉద్యోగం కల్పిస్తూ ఉత్తుర్వులిచ్చామని వివరించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధిత కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఒకరికి జూనియర్‌ సహాయకులుగా, ముగ్గురికి ఆఫీసు సబార్డినేట్స్‌గా నియామక ఉత్తర్వులిచ్చామన్నారు. గతంలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందటానికి సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు ఉద్యోగి మరణించిన నెలల్లోనే అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తున్నామని పేర్కొన్నారు.