వైద్యసేవలకు ప్రత్యేక చర్యలు

అంబులెన్స్‌ సర్వీసులు ప్రారంభించిన మంత్రి హరీష్‌

సిద్దిపేట,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో శుక్రవారం జగదేవ్‌పూర్‌ మండలానికి ప్రత్యేక 108 అంబులెన్సును కేటాయించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే 14 వాహనాలు వివిధ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్నాయని తెలిపారు. జగదేవ్‌పూర్‌లో ఈ రోజు నుంచి ప్రజలకు వైద్య సేవలు అందించడానికి అంబులెన్స్‌ అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో చిన్న కోడూర్‌, మర్కూక్‌, అక్కన్నపేట మండలాలకు 108 అంబులెన్సులను అందుబాటులోకి తీసకువస్తామన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. మొక్కజొన్న కొనాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల మొక్కజొన్న

రైతులకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. గతేడాది కొన్న మక్కలు గోడౌన్లలో అలానే ఉన్నాయని హరీష్‌రావు పేర్కొన్నారు. జిల్లాలో 30 కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తామన్నారు. 8 శాతం తేమ ఉన్నా పత్తికి రూ.5,775 మద్దతు ధర ఇస్తామని హరీష్‌రావు పేర్కొన్నారు. రూ.1,888 మద్దతు ధరకు వడ్లు కొనుగోలు చేస్తామని వెల్లడించారు. కొత్త వ్యవసాయ బిల్లు రైతుల పాలిట శాపంగా మారిందని హరీష్‌రావు పేర్కొన్నారు.