సరిహద్దుల మూసివేత

ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కోదాడవద్ద ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ సరిహద్దు (హైదరాబాద్‌-విజయవాడ హైవే)ను సైతం ఆదివారం ఉదయం మూసేశారు.

52 చెక్‌పోస్టులు

మహారాష్ట్రతోపాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బయటి రాష్ర్టాల నుంచి వచ్చేవారికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అని ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా 78 సంయుక్త వైద్య బృందాలను నియమించామన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యం లో, సీఎంవో, సీఎస్‌ కార్యాలయం, డీజీపీ కార్యాలయం పర్యవేక్షణలో, సీనియర్‌ అధికారులతో ఐదుగురుసభ్యుల నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అంతర్జాతీయంగా, జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, మన రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న  పరిస్థితులు.. మనం తీసుకొంటున్న చర్యలు సరిగా ఉన్నాయా.. లేవా.. ఇంకేం చర్యలు తీసుకోవాలన్నది నిరంతరం పర్యవేక్షిస్తూ సీఎం కార్యాలయానికి, సీఎస్‌, డీజీపీ కార్యాలయాలకు నిపుణుల కమిటీ సమాచారమిస్తుందని పేర్కొన్నారు.