సిజేరియన్‌ చేస్తుండగా కోమాలోకి

చికిత్స పొందుతూ గర్భిణి మృతి
డాక్టర్ల నిర్లక్ష్యమే అంటూ బంధువుల ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌28 జనం సాక్షి : కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. మహిళ భాగ్యలక్ష్మీ కాన్పు కోసం వచ్చి పది రోజుల క్రితం ఆస్పత్రిలో అడ్మిట్‌ అయింది. భాగ్యలక్ష్మి ఆపరేషన్‌ చేస్తుండగా ఒక్కసారిగా సీరియస్‌గా మారింది. సీజేరియన్‌ టైమ్‌లో భాగ్యలక్ష్మి కోమాలోకి పోయింది. వైద్యులు కుటుంబ సభ్యులకు మహిళ పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పడంతో వెంటనే మహిళను భద్రాచలం ఏరియా ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మహిళ పరిస్థితి విషమించింది. పది రోజులుగా కోమాలో ఉన్న భాగ్యలక్ష్మీ గురువారం తుదిశ్వాస విడిచింది. దీంతో మహిళ బంధువులు కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌ వైద్యుల నిర్లక్ష్యం వల్లే
భాగ్యలక్ష్మీ మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలంటూ భాగ్యలక్ష్మీ శవంతో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మరణించిందని ఆరోపించారు.