సిసిఐ కేంద్రాల్లోనే పత్తి అమ్మకాలు చేయాలి

దళారులను నమ్మి మోసపోవద్దన్న ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తి విక్రయించాలని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ప్రభుత్వం క్వింటాల్‌ పత్తికి రూ.5,825 ప్రకటించిందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఆయన సూచించారు. ఇదిలావుంటే జిల్లాలో పత్తి కొనుగోళ్ల పక్రియ పారదర్శకంగా కొనసాగుతున్నదని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు.రైతులు పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం జారీ చేయాలన్నారు. సమస్యలుంటే నేరుగా అధికారులకు తెలియజేయాలని రైతులకు సూచించారు. ధరణి పోర్టల్‌పై గ్రామాల్లోని ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కౌలుదారు, వారు సాగు చేసిన పత్తి పంట, విస్తీర్ణం, పట్టాదారు భూ సర్వే నంబర్‌, ఆధార్‌ నంబర్‌ వంటి వివరాల ఆధారంగా ధ్రువీకరణ పత్రం జారీ చేయాలన్నారు. ఇందుకోసం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆదిలాబాద్‌ సెంటర్‌కు మినహా మిగతా కేంద్రాల పరిధిలోని క్లస్టర్‌ గ్రామాల్లో షెడ్యూల్‌ ప్రకారం కూపన్లు జారీ చేయాలన్నారు. తక్కువ తేమ ఉన్న పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. యాసంగి పంటకు సంబంధించి శనగ విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని రైతులు పత్తిని దళారులకు అమ్మకుండా చూడాలన్నారు. త్వరలో మరో రెండు జిన్నింగ్‌ మిల్లులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.