సీమలో పరిశ్రమలతోనే ఉపాధి

అనంతపురం,డిసెంబర్‌14(జనం సాక్షి ): అనంత అభివృద్దితో పాటు సీమకు ప్రకటించిన పథకాలు తక్షణం అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న పరిశ్రమలు కార్యరూపం దాలిస్తే నిరుద్యోగ సమస్యరాదన్నారు. ఇకపోతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూ మేరకు ఉద్యోగం కల్పించడం లేదా నిరుద్యోగ భృతి ఇవ్వడం అన్న హావిూని అమలు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిరుద్యోగులందరికీ రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగ భృతిని కల్పించినున్నట్లు వస్తున్న వార్తలను ఆయన స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం నిరుద్యోగులకు ఒక తీపి కబురు. అయితే కేవలం ఉపాధి కల్పనా కార్యాలయాలలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే నిరుద్యోగ భృతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోరాదని, అందరికి వర్తించేలా పథకాన్ని అమలు చేయాలని అన్నారు. నిరుద్యోగ భృతి ముఖ్యంగా ఉద్యోగలు రాని వారికే చెందాలన్నారు. దీనికొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్‌ సైట్‌ను రూపొందించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తే మంచిదన్నారు. నిరుద్యోగుల వివరాలను సేకరించడంలో భాగంగా దారిద్యర్రేఖకు దిగువన ఉన్న విద్యార్థుల వివరాల సేకరణకుగాను తెల్ల రేషన్‌ కార్డును ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే నిజమైన నిరుద్యోగులు ఎక్కువశాతం బయటపడతారు. కుటుంబ సంవత్సర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని, తద్వారా నిజమైన నిరుద్యోగులను ఎంపిక చేసి, వారికే నిరుద్యోగభృతి అందచేయాలన్నారు.