సోషలిస్టు యోధుడు శరద్‌యాదవ్‌ ఇకలేరు

 

 

 

 

 

 

సోషలిస్టు యోధుడు శరద్‌యాదవ్‌ ఇకలేరు
అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
7సార్లు లోక్‌సభకు, 3 సార్లు రాజ్యసభకు ఎన్నిక
కేంద్ర మంత్రిగా విశేష సేవలందించిన నేత
తెలంగాణ ఉద్యమానికి గట్టి మద్దతు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం
న్యూఢిల్లీ, జనవరి 12: సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్‌ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఆయనను దవాఖానకు తీసుకొచ్చారని, తాము ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయామని గురుగ్రామ్‌లోని ఫోర్టిస్‌ దవాఖాన ఓ ప్రకటనలో తెలిపింది. సోషలిస్టు దిగ్గజం జయప్రకాశ్‌ నారాయణ్‌కు అనుచరుడైన శరద్‌యాదవ్‌.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2003లో బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైన జనతాదళ్‌(యునైటెడ్‌)కు తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2016 వరకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం నితీశ్‌తో పొసగకపోవడంతో పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు.