హాస్పిటల్ యాజమాన్యాలపై కొరడా ఝులిపిస్తున్న మున్సిపాలిటీ

సిద్దిపేట బ్యూరో 14, జూన్ ( జనం సాక్షి )
స్వచ్ఛ ,ఆరోగ్య,పారిశుద్ధ్య సిద్దిపేట సాధనలో భాగంగా సిద్దిపేట పట్టణంలో గతకొంత కాలంగా తడి,పొడి, హానికర మరియు వ్యక్తిగత పారిశుద్ధ్య వ్యర్థాల సమర్ధ నిర్వహణ కొరకు విస్తృత చర్యలను సిద్ధిపేట మున్సిపాలిటీ చేపడుతుంది.కాగా సిద్దిపేట పట్టణంలో నెలకొని ఉన్న వివిధ ఆసుపత్రులలో వెలుబడే జీవసంబంధ, హానికర వ్యర్థాలు మరియు ఇతర వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది. ఇట్టి నిమిత్తం పట్టణంలో గల వివిధ ఆస్పత్రులలో మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం విస్తృత తనికీలు నిర్వహించగా చాలా ఆస్పత్రిలలో నిబంధనలు ఉల్లంఘించబడినట్లుగా గుర్తించటం జరిగింది. జీవసంబంధ, హానికర, వైద్య సంబంధ వ్యర్థాలను సాధారణ వ్యర్థాలతో కలిపి ఇవ్వడం  ఆరుబయట పడవేయటం లాంటి చర్యలు గుర్తించటం జరిగింది.
సుష్మ నర్సింగ్ హోమ్ , శేషాద్రి హాస్పిటల్ , ప్రైమ్ కేర్ హాస్పిటల్ , సురక్ష హాస్పిటల్,శ్రీ చరణ్ హాస్పిటల్,అశ్వత్ హాస్పటల్ , మానస హాస్పిటల్, మెడికేర్ హాస్పిటల్,మాలిక హాస్పిటల్ మొదలైన ఆస్పత్రుల యజమాన్యులపై దాదాపు 75 వేల రూపాయల వరకు జరిమానా విధించడం జరిగింది.పర్యావరణ పరిరక్షణ కొరకు , స్వచ్ఛ సిద్దిపేట సాధన కొరకు ఆస్పత్రుల యజమాన్యాలు గురుతర బాధ్యత వహించాలని , మున్సిపల్ యంత్రాంగం తో సహకరించాలని , ఎట్టి పరిస్థితుల్లో చెత్త బయట పడవేయొద్దని , నియమ నిబంధనల మేరకు మాత్రమే చెత్త నిర్వహణ చేయవలెనని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.