సిజేరియన్‌లపై సర్కారు సీరియస్‌

` ప్రైవేటు కడుపుకోతలపై కేసీఆర్‌ కన్నెర్ర
` కాసులకు కక్కుర్తిపడే దవాఖానల కోతలకు వాతే..
` ప్రతీ సిజేరియన్‌పై వివరణ ఇవ్వాల్సిందే…
జగిత్యాల ప్రతినిధి(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో వైద్య ఆరోగ్యశాఖ మెరుగుపడిరది. నిరుపేదలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయడంకోసం వారిపై పూర్తిగా భారం తగ్గిస్తూ ప్రభుత్వం పథకాలను జోడిరచింది. దీంతో రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం వాకిట్లోకి వచ్చింది. అయినా ప్రభుత్వ వైద్యులే ప్రైవేట్‌ నర్సింగ్‌హోం నడిపించే యజమానులు కావడంతో వైద్య ఆరోగ్య శాఖను ఇంకొన్ని రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది సిజేరియన్‌ ఆపరేషన్లు. ఎన్నో ఏళ్ళతరబడి ఈ సిజేరియన్‌ ఆపరేషన్ల వల్ల అనేక మంది మహిళలు తమ ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోయారు. ఇకపై సిజేరియన్‌ ఆపరేషన్లను క్షేత్రస్థాయిలో కట్టుదిట్టం చేసి రాష్ట్రంలోని ఆడపడు చులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని సమకూర్చడానికి వైద్య ఆరోగ్యశాఖ నడుం బిగించింది.మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో వైద్య ఆరోగ్యశాఖ సిజేరియన్లపై చర్యలు మొదలు పెట్టింది. పుట్టుకకోసం పెట్టేమూహూర్తాలను నిరోధిస్తూ సిజేరియన్లపై ఉక్కుపాదం మోపుతోంది. అంతరిక్షంలో అడుగుపెడుతున్న మనిషి ఇంకా మూహూర్తాలకు బానిసగానే ఉంటున్నా డు.చావు పుట్టుకలకు మూహూర్తాలు ఉండవని తెలిసి పుట్టుకకోసం ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఒకవైపు ముహూర్తాలు మరోవైపు సిజేరియన్లు మహిళల ను అనారోగ్యవంతులను చేస్తున్నాయి. సిజేరియన్‌ ఆపరేషన్లలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాపై దృష్టి సారించింది. కలెక్టర్లకు సిజేరియన్‌ల ఆపరేషన్లపై ఒక ప్రణాళిక రూపొందించి సిజేరియన్లను పూర్తిగా నివారించాలనే సూచన చేసింది. దీంతో జిల్లాల వారిగా కలెక్టర్లు పురోహితులు, వైద్యులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ముహూర్తాలు పెట్టవద్దని పెట్టిన ముహూర్తాలకు సిజేరియన్లు చేయవద్దని కలెక్టర్లు ఇరువర్గాలకు సూచనలు చేశారు. పురోహితులు పుట్టుక కోసం ముహూర్తాలు పెట్టబోము అని బోర్డులు ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్లు సూచనలు చేశారు. వైద్యులు కూడా ఖచ్చితమైన ఆధారాలు అవసరం ఉంటేనే సిజేరియన్‌కు వెళ్ళాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ధిష్టమైన నిబంధనలు జారీచేసింది. కరీంనగర్‌ జిల్లాలో సిజేరియన్‌ ఆపరేషన్లు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉండడానికి కారణం అడ్డగోలుగా వెలుస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు వాటిపై అజమాయిషీ లోపంతో అత్యధిక సిజేరియన్లు నమోదవడం మొదటి కారణమైతే రెండవది ముహూర్తపు పుట్టుక కోసం పట్టుబట్టి సిజేరియన్లు చేయించుకుంటున్న వారు మరికొందరు. కారణాలేవైనా రాష్ట్రంలో సిజేరియన్‌ ఆపరేషన్లను గణనీయంగా తగ్గించాలనే దృక్పదంతో రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు నేతృత్వంలో తీవ్ర కసరత్తు జరుగుతోంది.
సిజేరియన్‌కు గురైన మహిళ ఆయుష్షు తగ్గుంతుంది
రాష్ట్రంలో 100 కాన్పులకు 80 కాన్పులు సిజేరియన్‌లే. సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయించుకున్న ఆడపడుచులు తమ సంపూర్ణ ఆరోగ్యాన్ని మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది. ఒక్కసారి సిజేరియన్‌కు గురైనా మహిళ సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఎప్పటికీ కాలేదని వైద్య నిపుణులు చెప్తున్నారు. పైగా వీరి జీవితకాలం కూడా గణనీయంగా తగ్గుతుందంటున్నారు. సిజేరియన్‌ ఆపరేషన్‌కు గురైన మహిళకు జీవితకాలం వెన్ను నొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. తరువాత కాన్పులకు కూడా సిజేరియన్లకు వెళ్ళాల్సి వస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయినా మూర్ఖంగా ముహూర్తాలకోసం పట్టుబడ్డి కడుపులు కోయించుకుంటున్నారు. వీటన్నింటికి వైద్య ఆరోగ్యశాఖ కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించింది. వీటిని అమలు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు ప్రారంభించింది. ముహూర్తాలు పెట్టినా వైద్యులు అకారణంగా సిజేరియన్‌ చేసినాఆసుపత్రిని సీజ్‌ చేయడంతో పాటు వైద్యుని సర్టిఫికెట్‌ను రద్దు చేస్తారు. ప్రభుత్వం, ప్రైవేట్‌ ఏ ఆసుపత్రిలోనైనా ప్రతి సిజేరియన్‌కు ఓ ఖచ్చితమైన లెక్క ఉండాలి. సిజేరియన్లకోసం ఆసుపత్రికో రేటు పెట్టినా అడ్డగోలు చార్జీలు వేసినా నిబంధనలు అమలులోకొచ్చి ఆసుపత్రుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఒక్కో ఆసుపత్రికి కాన్పు రిస్కును బట్టి లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు చార్జీ చేస్తున్నారు. హైరిస్క్‌ ప్రగ్నెన్సీ, షుగర్‌, హైపోటెన్సీ లాంటి కేసులను ప్రైవేట్‌ ఆసుపత్రులు మూడు లక్షల వరకు చార్జీ చేస్తున్నాయి. సిజేరియన్లపై ఫిక్స్‌డ్‌ రేట్లు పెట్టడానికి ఇది మార్కెట్లో దొరికే వస్తువు కాదని ప్రెగ్నెన్సీని బట్టి చార్జీలు ఉంటాని వైద్యులు చెప్తున్నారు. ఈ డెలివరీలో డాక్టర్లు నలిగిపోతున్నారని ఒక వైపు ముహూర్తాలంటూ ఒత్తిడి చేయడం. మరోవైపు ప్రభుత్వం సాధారణ కాన్పులు చేయాలంటూ చెప్తోంది.
ఇకపై సిజేరియన్లన్నీ కట్టుదిట్టం…
మంత్రి హరీష్‌రావు వైద్య ఆరోగ్య శాఖకు ఏళ్ళ తరబడి ఉన్న జఠిలమైన సిజేరియన్ల సమస్యకు ఒక పరిష్కారం రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సిజేరియన్లు చేసే ప్రతి వైద్యుడు తమ చేసిన సిజేరియన్‌కు ఖచ్చితమైన లెక్క చెప్పాల్సిందే. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రోజుకు ఎన్ని సిజేరియన్లు చేస్తున్నారో ప్రతి సిజేరియన్‌కు పేషంట్‌కు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సిందే. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నుంచి నేరుగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సిజేరియన్‌ ద్వారా ప్రసవం పొందిన మహిలకు పోన్‌ వెళ్తుంది. ఫోన్‌ ద్వారా సిజేరియన్‌ వివరాలు తల్లీ బిడ్డల క్షేమాలు వైద్య ఆరోగ్య శాఖ ఇకపై తెలుసుకుంటుంది. ప్రైవేట్‌ ఆసుపత్రి పేరు, చెల్లించిన బిల్లులపై కూడా ఆరా తీస్తారు. దీంతో అడ్డగోలుగా సిజేరియన్లకు రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌ పడనుంది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నుంచి నియోజక వర్గ కేంద్రంలో ఆసుపత్రుల వరకు ప్రతీ సిజేరియన్‌కు సదరు ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రతి డాక్యుమెంట్‌ పక్కాగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఆసుపత్రి గుర్తింపు రద్దుతోపాటు వైద్యుడి సర్టిఫికెట్‌ కూడా రద్దు చేయబడుతుందనే నిబంధన రూపొందించారు.
సిజేరియన్ల నిబంధనలు ఇలా ఉన్నాయి
1. సిజేరియన్‌ ఆఫరేషన్‌ చేయాలంటే మహిళ 35 సం॥ పై బడి ఉండాలి. ఎత్తు 145 సెం.మీ గా ఉండాలి.
2. హైరిస్క్‌,శిశువు అడ్డం తిరగడం తోపాటు డయాబెటిస్‌, అధిక రక్తపోటు ఉన్నవారికి మత్రమే సిజేరియన్‌ చేయాలి.
3.సిజేరియన్‌ చేసిన తర్వాత మాతా శిశువుకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపర్చాలి.
4.ప్రతినెల ఆడిట్‌ అధికారులు ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రి రికార్డును పరిశీలిస్తారు.
5.నివేదికలు తప్పుగా ఉన్నా, ఆడిట్‌ అధికారులు సంతృప్తి చెందకపోయినా నేరుగా సంబంధిత మహిళలకు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకుంటారు.
6.తప్పని తేలితే ఆస్పత్రి గుర్తింపు రద్దుచేయడంతోపాటు సిజేరియన్‌ చేసిన మహిళా వైద్య నిపుణురాళ్ళ సర్టిఫికెట్‌ రద్దుచేసి చర్యలు తీసుకుంటారు.
7.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సిజేరియన్‌ ఆపరేషన్లు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతోపాటు మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
8..గుర్తింపు పొందిన ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రసవానికి సంబంధించిన అత్యాధునిక పరికరాలు ఉండాలి.
9.ఆపరేషన్‌కు అనుగుణంగా సిబ్బంది ఉండాలి. లేబర్‌ రూం, నర్సింగ్‌ సిబ్బంది, మత్తు వైద్యులు వీటన్నింటిని పక్కాగా పరిగణలోకి తీసుకుంటారు.
10.నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయో వాటిలో ఎన్ని సిజేరియన్లు జరుగుతున్నాయో పొందుపర్చాలి.
11.నివేదక సరిగ్గా పొందుపర్చని ఆసుపత్రులకు నోటీస్‌లు ఇస్తారు. గడువులోగా సమాధానం ఇవ్వకపోతే ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటారు.