బాలీవుడ్‌లో కరీంనగర్‌ తేజం.. పైడి జైరాజ్‌


తెలంగాణ చరిత్రపై మట్టికప్పుతున్న సీమాంధ్రులు
1980లోనే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు
వందేళ్ల సినిమా పండగలో తెలంగాణకు తీవ్ర అవమానం
‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం
హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) :
దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు.. భారతీయ చిత్రసీమలో అస్కార్‌తో పోల్చదగినది. ఈ అవార్డు సొంతం చేసుకోవడం ప్రతి నటుడికి జీవితాశయం. 1969లో ఈ అవార్డును ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర సాంస్కృతిక, చలనచిత్ర మంత్రిత్వ శాఖ 43 మందిని ఈ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు భారతీయ చిత్రసీమలో దిగ్గజాలుగా పేర్కొంటున్న వారెందరో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వైపు కన్నెతి చూడలేని సమయంలో ఆ అవార్డును సొంతం చేసు కున్న కరీంనగర్‌ తేజం మాత్రం ఇప్పుడు ఎవరికి అక్కరకు రానివాడయ్యాడు. తన అద్భుత నటనతో చారిత్రక పురుషు లకు ప్రాణ ప్రతిష్ట చేసిన ఆయన నటనాకౌశలం ఇప్పుడు చరిత్రగానే మిగిలింది. ఇప్పటి మెగా, సూపర్‌స్టార్ల భజనతోనే స్మరిస్తూ మీడియా కూడా అలాంటి దిగ్గజాలను విస్మరిస్తోంది. ఇటీవల కాలంలో అది బాలీవుడ్‌ కావొచ్చు.. టాలీవుడ్‌ కావొచ్చు.. కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భాష చిత్రసీమలోనైనా వారసుల భజన ఎక్కువైంది. ఈ హీరో, అతడి తండ్రి, తాత, ముత్తాతలను కీర్తించడంలోనే మీడియా మునిగి తేలుతోంది. ఇక తెలంగాణ నటుల విషయానికి వస్తే మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. శాటిలైట్‌ చానెళ్ల విస్తృతిలో దీనికి అంతే లేకుండా పోతుంది. ఇలాంటి సందర్భంలో ఉద్యమ ఖిల్లాగా ఖ్యాతిగాంచిన కరీంనగర్‌ గడ్డపై పుట్టిన బిడ్డ బాలీవుడ్‌ను ఏలిన వైనం.. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు సొంతం చేసుకున్న తీరును మీ ముందుంచుతున్నాం. ఇటీవల చెన్నైలో జరిగిన భారతీయ చలన చిత్ర పరిశ్రమ శతాబ్ది ఉత్సవాల్లోనూ మన నటదిగ్గజం పేరు వినిపించకపోవడం ఆశ్చర్యానికి  గురిచేసింది. అవమానంగానూ అనిపిస్తోంది. మన నటదిగ్గజం ఘన కీర్తిని మనవాళ్లకు పరిచయం చేద్దామనే ఈ ప్రయత్నం…

పైడి జైరాజ్‌.. ఈ పేరుతో తెలుగు వాళ్లకు తక్కువగా తెలుసేమో కానీ బాలీవుడ్‌కి మాత్రం కొత్తది కాదు. ఆరున్నర దశాబ్దాల పాటు భారతీయ చిత్రసీమకు దిక్సూచీ లాంటి బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ప్రముఖుడు జైరాజ్‌. 1909 సెప్టెంబర్‌ 28న అప్పటి హైదరాబాద్‌ రాజ్యంలోని కరీంనగర్‌లో జన్మించారాయన. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల గ్రాడ్యూయేషన్‌ చేసిన జైరాజ్‌ సినిమాల మీద మక్కువతో తన 20 ఏళ్ల ప్రాయంలో 1929లో బాంబేకు పయనమయ్యాడు. స్వతహాగా అందగాడైన జైరాజ్‌కు సినిమా పరిశ్రమలో ఎవరితో పరిచయం లేకపోయినా స్వయం కృషితో ఎదిగాడు. 156 చిత్రాలలో హీరోగా నటించాడు. 300లకు పైగా మూకీ, టాకీ సినిమాలలో నటించాడు. జైరాజ్‌ నటించిన మొదటి మూకీ చిత్రం ‘స్పార్ల్కింగ్‌ యూత్‌’ 1930లో విడుదలైంది. అదే ఏడాది ‘ట్రయంగ్‌ ఆఫ్‌ లవ్‌’ అనే మరో మూకీ సినిమాలో నటించాడు. జైరాజ్‌ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931లో భారత్‌లో టాకీ చిత్రాల నిర్మాణం ప్రారంభం కాగా అదే ఏడాది ‘షికారి’ అనే ఉర్దూ చిత్రంలో నటించారు. తర్వాతి కాలంలో అప్పటి బాలీవుడ్‌ ప్రముఖులు శాంతారాం, పృథ్వీరాజ్‌కపూర్‌ తదితర పెద్ద హీరోలతో కలిసి నటించి పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌ ఆల్‌టైం గ్రేట్‌ హీరోయిన్లు నిరుపారాయ్‌, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి ఎందరో హీరోయిన్లు జైరాజ్‌ పక్కన నాయికలుగా నటించారరు. హీరోగా జైరాజ్‌ అనేక విలక్షణ పత్రలను పోషించి తనదైన ముద్ర వేశారు. ఉర్దూ అధికార భాషగా గల కరీంనగర్‌లో జన్మించిన జైరాజ్‌ మాతృభాష తెలుగు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్‌లోనే ఉండేది. 20 ఏళ్ల చిరుప్రాయంలోనే బాలీవుడ్‌లో కథనాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన జైరాజ్‌ ఉర్దూ, మరాఠీ, గుజరాతీ భాష చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మంచి పేరుతెచ్చుకున్నారు. కానీ ఆయన ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. వైవిధ్యభరితమైన పాత్రలతో నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన జైరాజ్‌ను చలన చిత్రరంగం కావాలనే విస్మరిస్తోంది అనేది నిజం. టిప్పూ సుల్తాన్‌, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, రాణాప్రతాప్‌, అల్లావుద్దీన్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, షాజహాన్‌, తదితర చారిత్రక, జాతీయ నాయకుల పాత్రల్లో ఒదిగిపోయారయన. సినిమాల్లో ఎన్నిరకాల పాత్రలు ధరించినా జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తుండేవి, ప్రేరణ కలిగించేవి అని ఆయన చెప్పేవారు. జైరాజ్‌ నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా చిత్రసీమకు ఎనలేని సేవలందించారు. మెహర్‌, రాజ్‌ఘర్‌, మాల, ప్రతిమ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పీజే ఫిల్మ్స్‌ యూనిట్‌ పతాకంపై ‘సాగర్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సుప్రసిద్ద కథానాయిక నర్గీస్‌ హీరోయిన్‌. భారతీయ చిత్రసీమకు జైరాజ్‌ చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1980లో ఆయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రదానం చేసింది. ఈ సుప్రసిద్ధ అవార్డును సొంతం చేసుకున్న మొట్టమొదటి తెలుగువాడు జైరాజ్‌. జైరాజ్‌ పంజాబీ యువతి సావిత్రిని జీవిత భాగస్వామిగా స్వీకరించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 1930లో తెరంగేట్రం చేసిన జైరాజ్‌ 1995లో ముఖానికి మేకప్‌ వేసుకోవడం మానేశారు. ఇష్టమైన సినిమాలకు దూరమయ్యాననే దిగులుతోనే 2000 ఆగస్టు 11 ముంబయిలో కన్నుమూశారు.

జైరాజ్‌ నటించిన సినిమాల్లో కొన్ని : జగ్మతీ జవాని (1930), షికారీ (1932), మాయాజల్‌, పతిత్‌ పావన్‌, ఔరత్‌ కా దిల్‌(1933), మజ్దూర్‌ (1934),  షేర్‌ దిల్‌ ఔరత్‌, జీవన్‌ నాటక్‌ (1935), తూఫానీ ఖజానా (1937), మధుర్‌ మిలన్‌ (1938), జుగారీ, లితాఫేస్‌ (1939),  చంబే ది కాలీ(1940), ప్రభాత్‌, మాలా, స్వామి (1941), నయీ దునియా (1942), నయీ కహానీ, హమారీ బాత్‌, ప్రేమ్‌ సంగీత్‌ (1943), పన్నా (1944), షాజహాన్‌, రాజ్‌పుతానీ (1946), సాజన్‌ కా ఘర్‌, అంజుమన్‌, ఆజాదీ కి రాపర్‌(1948), దరోగజి, రుమాల్‌, సింగార్‌, అమర్‌ కహానీ (1949), రాజ్‌పూత్‌, సాగర్‌ (1951), లాల్‌ కున్వర్‌ (1952), బాదాన్‌ (1954), తీరందాజ్‌, ఇన్సానియాత్‌ (1955), పరివార్‌, హతిమ్‌ తాయి(1956), ముంతాజ్‌ మహల్‌, జర్నీ బియాండ్‌ త్రీ సీస్‌ (1957), రిటర్న్‌ ఆఫ్‌ మిస్టర్‌ సూపర్‌మ్యాన్‌, లాల్‌ ఖిలా (1960), రజియా సుల్తానా, ఆస్‌ కా పంచీ, జయ్‌ చితోడ్‌ (1961), నైన్‌ అవర్స్‌ టు రామా (1963), ఖుఫియా మహల్‌ (1964), బాగీ హసీనా (1965), మాయా (1966), నీల్‌ కమల్‌ (1968), గునా ఔర్‌ ఖానూన్‌, జీవన్‌ మృత్యు (1970), నాదాన్‌, చోటీ బాను (1971), సాజిదా (1972), గెహ్రీ చాల్‌, సూరజ్‌ ఔర్‌ చంద, చెలియా, నాగ్‌ మేరే శాంతి (1973), చోర్‌ చోర్‌, ఫస్లా(1974), ఖాలా సోనా, షోలే, తూఫాన్‌ (1975), హీరా పెరీ, నాగ్‌ చంపా (1976), చిల్లా బాను, కచ్చా చోర్‌ (1977), డాన్‌, ఆఖ్రీ దాను, ఖూన్‌ ఖా బాద్‌లా ఖూన్‌ (1978), అహింసా, నాగీన్‌ ఔర్‌ సుహగాన్‌ (1979), జ్యోతి బనే జ్వాలా, జజ్బాత్‌ (1980), ఫిఫ్టీ ఫిఫ్టీ, ఖూన్‌ ఔర్‌ పానీ, క్రాంతి (1981), అర్ద్‌ సత్య, మాసూమ్‌, కరాటే, పుకార్‌ (1983), బిందియా చమ్కేగి, ఉంచీ ఉరాన్‌ (1984), జిందా లాష్‌ (1986), ఖూన్‌ బరీ మాంగ్‌ (1988), లంబూ దాబా(1992), బేటాజ్‌ బాద్‌షా (1994), గాడ్‌ అండ్‌ గన్‌ (1995).

ప్రతిమ (1945), సాగర్‌ (1951), మోహన్‌ (1959) చిత్రాలకు జైరాజ్‌ దర్శకత్వం వహించారు. ఎందరో దిగ్గజాలు జైరాజ్‌ కలిసి అడుగులేశారు. చిత్రసీమలో కలకాలం గుర్తిండుపోయే పాత్రలు ధరించిన జైరాజ్‌ మన తెలంగాణ బిడ్డ.. కరీంనగర్‌ వాడు కావడం అందరికీ గర్వకారణం.