అంగన్ వాడి చిన్నారుల పోషణ పరిస్థితిని పర్యవేక్షించాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
అంగన్వాడి కేంద్రాలలో పిల్లల పోషణ స్థితిని గుర్తించి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నాడు బీబీనగర్ అంగన్వాడి కేంద్రంలో జరిగిన శుక్రవారం సభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తల్లులకు శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం, మూడు సంవత్సరముల లోపు పిల్లలకు బాలామృతం, గుడ్లు సకాలంలో అందించాలని, పోషణలోపం పిల్లలను గుర్తించి వారిని సూపర్వైజరి ఫీడింగ్ లో నమోదు చేసి ప్రత్యేక ఆహారం అందించాలని, తల్లులకు సలహాలు అందించి వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. మంచి ఆహారపు అలవాట్లపై అవగాహన కలిగించాలని పోషణ లోపం వలన కలిగే నష్టాలను వివరించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు పోషణ కార్యక్రమాలను మానిటరింగ్ చేసుకోవాలని, డాష్ బోర్డులో డేటా ఎంట్రీ చేయాలని తెలిపారు. ప్రజాప్రతినిధులను, యువజన సంఘాలను సంబంధిత శాఖల సమన్వయంతో ఈనెల 1 నుండి 30 వరకు జరిగే పోషణ మాసం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారంతో పాటు వ్యాయామం, యోగ లాంటి వాటిని చేస్తూ సమయానికి వైద్యులు అందజేసిన మందులు వినియోగిస్తూ ఉండాలని, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ఎక్కువగా నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా మహిళలు సులభంగా పనులను చేసుకోవచ్చని గర్భిణీ స్త్రీలకు, తల్లులకు సూచించారు అన్నారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎంపీపీ ఎ.సుధాకర్ గౌడ్, జిల్లా మహిళా శిశు అభివృద్ధి అధికారి శ్రీమతి కృష్ణవేణి, ఎంపీడీవో బాల శంకరం, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్య ప్రకాష్, సిడిపిఓ స్వరాజ్యం, తదితరులు పాల్గొన్నారు.