అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ముట్టడిని అడ్డుకోలేరు

– ప్రతిపక్షాల గొంతునొక్కేలా ప్రభుత్వంతీరు

– కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క

హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు శాంతియుతంగా శుక్రవారం నిర్వహించ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అధికార బలంతో అడ్డుకొనేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సీఎల్‌పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్కలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీఎల్‌పీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులను రాజులుగా చేస్తామంటూ ఢంకా బజాయిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం వారు కష్టాల్లో ఉంటే ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే నాలుగు విడతలుగా

రుణమాఫీ చేయటం వల్ల రైతులు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు సాగుచేసిన పంటలు చేతికందే సమయంలో నష్టపోవాల్సి వచ్చిందని, రైతుల ఉత్పత్తులను మార్కెట్‌లో కూడా సరైన గిట్టుబాటు లేక ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు పంటనష్టపరిహారం అందించాలని, రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌ గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని

అడ్డుకోవాలని తెరాస ప్రభుత్వం చూడటం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా ఈ ముట్టడిని తలపెట్టాలని నిర్ణయించటం జరిగిందని కానీ ప్రభుత్వం ముందస్తు అక్రమ అరెస్టులు, గృహనిర్భందాలతో గందరగోళం ఉద్రిక్తతలు రేకెత్తేలా చేస్తుందన్నారు. ప్రజాప్రతినిధులను, మహిళా ప్రజాప్రతినిధులను కూడా అడ్డగోలుగా అరెస్ట చేసి గత రాత్రి నుంచి రేపు రాత్రి కూడా వదిలిపెట్టమని చెబుతున్నారన్నారు. చాలా ప్రాంతాల్లో అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్‌లు అరెస్టులు చూపించకుండా ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతత్వ పోకడలతో ప్రతిపక్షాలను అనగదొక్కాలని ప్రభుత్వం చూస్తూ కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రైతుట పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.

 

 

తాజావార్తలు