అటవిసంరక్షణకు సహకరించాలి : అన్నాహజారే

చంద్రపూర్‌ (బల్లార్ష), జనంసాక్షి : నానాటికీ తరగిపోతున్న అటవీసంపదను రక్షించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు అటవీ పరిసర గ్రామాల ప్రజలు నడుంబిగించాలని ప్రఖ్యాత సహజ సేవకులు అన్నాహజారే అన్నారు. చంద్రపూర్‌లోని అటవీ రేంజీ కళాశాలలో శనివారం అటవీ వ్యవస్థాపన సమితి సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. మహత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని స్థాపించేందుకు గ్రామస్థులు అటవీశాఖ సహకారాన్ని తీసుకోవాలని కోరారు. వ్యవస్థాపన సముతులు ద్వారా అటవీసంపదను కాపాడటంలో దేశంలో మహారాష్ట్ర ముందుందని తెలిపారు. గడ్చిరోలి జిల్లాలోని కొండాడా, చంద్రపూర్‌ జిల్లాలోని కడమనా, వార్ధా జిల్లాలోని ఆమ్‌గావ్‌ గ్రామాల వ్యవస్థాపన సముతులు సాధించిన పురోగతిని సమావేశంలో సంబంధిత గ్రామస్థులు తెలిపారు. సమావేశంలో అటవీశాఖ ప్రధాన కార్యదర్శి సచిన్‌పరదేశి, జిల్లా అటవీ శాఖ అధికారి బియన్‌కే రెడ్డి, ఆ శాఖల అధికారులు వినయ్‌కుమార్‌ సిన్హా, శ్యాంసుందర్‌ మిశ్రా, నితిన్‌కోలేకర్‌తో పాటు జిల్లాలోని అటవీశాఖ అధికారులు, గ్రామవ్యవస్థాపన కమిటీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.