అడ్డంకులను అధిగమిస్తాం అవినీతిని నిర్మూలిస్తాం

సంస్కరణలు కొనసాగిస్తాం
చైనా నూతన ప్రధాని కికియాంగ్‌
బీజింగ్‌, (జనంసాక్షి) : అడ్డంకులను అధిగమించి.. అవినీతిని నిర్మూలిస్తామమని చైనా కొత్త ప్రధాని లీ కికియాంగ్‌ అన్నారు. సంస్కరణల అమలు, అవినీతి నిర్మూలన చైనా కమ్యూనిస్టు పార్టీకి సవాల్‌గా మారనున్నదని ఆయన అన్నారు. అభివృద్ధిలో ముందుకు సాగేందుకు ఇవన్నీ అడ్డంకిగా ఉండటం బాధాకరమన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) ఆయనను నూతన ప్రధానిగా శుక్రవారం నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రెండు స్థాయిల మంత్రివర్గాన్ని రద్దు చేసి తిరిగి పాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరిస్తానని చెప్పారు. సమర్థ పాలన అందించే చర్యల్లో భాగంగా ఇది తన ప్రభుత్వ తొలి అడుగు అని అన్నారు. ఈ చర్యను స్వయం ప్రతిపాదిత విప్లవంగా ఆయన అభివర్ణించారు. అధికారుల ఆగడాలను  అరికడుతూ ప్రభుత్వ అధికారాన్ని నియంత్రించేందుకు వీలుగా ఈ విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని వల్ల సామాజిక, మార్కెట్‌ శక్తులకు ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుందన్నారు. ఇంకా 17 వందల వస్తువులు మంత్రివర్గ ఆమోదం పొందాల్సి ఉందన్నారు. ఈ సంఖ్యను మూడో వంతుకు తగ్గించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వంలో జరిగే వృథాను అరికట్టేందుకు మూడు రకాల చర్యలు తీసుకోబోతున్నట్టు నూతన ప్రధాని లీ తెలిపారు. నూతన భవనాల నిర్మాణం, అధికారుల అతిథి గృహాల నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఉపయోగించబోమన్నారు. ప్రభుత్వ వేతన జాబితాలో ఉన్న  వారి సంఖ్యను రానున్న రోజుల్లో తగ్గిస్తామన్నారు. అధికారుల గౌరవార్థం ఖర్చు చేసే వ్యయంపై నియంత్రణ విధిస్తామని ఆయన చెప్పారు. అధికారల ప్రాబల్యం, అవినీతి పెరగడం పట్ల చైనాలో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న  విషయాన్ని ఆయన అంగీకరించారు. సాహసోపేతంగా రాజకీయ సంస్కరణలు చేపట్టాలన్న నేపథ్యంలో పెరుగుతున్న ఆకాంక్షల వల్ల ప్రస్తుతం తాము తీసుకోబోయే చర్యలు అవినీతి నిర్మూలనకు సరిపోతాయోలేదో చూడాలన్నారు. సంస్కరణలను ముందుకు తీసుకుపోయేందుకు కొన్ని స్వార్థ ప్రయోజనాలు అడ్డంకిగా నిలిచాయని ఆయన అన్నారు. కొన్ని సందర్భాలలో  అంతరాత్మ క్షోభ కంటే ఈ స్వార్థ ప్రయోజనాలే ఎక్కువ కష్టం కలిగిస్తాయని ఆయన అన్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ మీడియా సమావేశంలో విదేశాంగ విధానంపై ఆయన కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే జవాబిచ్చారు.  ఉమ్మడి ప్రయోజనాలు ఉభయ దేశాల మధ్య భేదాలను తొలగించగలవని చైనా, అమెరికా సంబంధాలపై అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు.  ఇటీవలి కాలంలో చైనా సైనిక దళాలపై అమెరికా అధికారులు సైబర్‌ హ్యాకింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. చైనా కూడా ఈ హ్యాకింగ్‌ దాడులకు గురయిందని చెప్పారు.