అన్యాయాన్ని ప్రశ్నిస్తే మావోయిస్టులా ?

కూడంకుళం నిజనిర్ధారణ కమిటీపై అక్రమ కేసులు
బనాయింపుపై మండిపడ్డ వరవరరావు
హైద్రాబాద్‌, అక్టోబర్‌ 22(జనంసాక్షి):
అన్యాయాన్ని ప్రశ్నిస్తే మావోయస్టులని ముద్ర వేసి అరెస్ట్‌ చేయడం అన్యామని విరసం నేత వరవరరావు మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూడంకళంలో అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంపై ప్రభుత్వం దారుణమైన నిర్భందకాండను అనుసరించిందని ఆరు వేలకు పైగా కేసులు అక్కడివారిపై నమోదు చేసిందని ఆయన తెలిపారు. అయితే అక్కడ కేసులను పరిశీలించడానికి వెళ్లిన అఖిల భారత నిజనిర్దారణ బృందాన్ని ఈ నెల12న అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్‌ చేసిన వారిపై అక్రమంగా కేసులు బనాయించారని మండిపడ్డరు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురి సభ్యలలో పౌరహక్కుల సంఘం సభ్యుడు హమీద్‌, రాయలసీమ విద్యార్థి వేదిక సభ్యుడు దస్తగిరి, విరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్వి వరలక్ష్మిలను మావోయిస్టు పార్టీ ప్రచారం కోసం వచ్చారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మీడియా మద్ధతిస్తూ వారం రోజులు దుష్ప్రచారం చేశాయన్నారు. ప్రజాస్వామ్య వాదులు తిరస్కరిస్తున్న సెక్షన్‌లు 143, 188, 294(బీ), 353, 332, 505(1), రెడ్‌ విత్‌ 7(1) కేసుల నమోదు చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చారని తెలిపారు. ఉద్యమ కారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, ఆప్రాంతంలో 144 సెక్షన్‌ను ఎత్తివేసి పోలీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసిండ్రు. అణువిద్యుత్‌ ఆలోచనను మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విరసం ఉషాడాన్ని, జూలూరీ గౌరీశంకర్‌, సూరేపల్లి సుజాత, బల్లర రవీంద్ర, డివి రామక్రిష్ణారావ్‌, తదితరులు పాల్గొన్నారు.