అమెరికా పాఠశాలలో కాల్పులు : 20 మంది మృతి

అమెరికా : అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రం న్యూటౌన్‌లోని శాండీ హుక్‌ ఎలమెంటరీ పాఠశాలలో ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 12 మంది విద్యార్థులతో సహా మొత్తం 20 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. కాల్పుల సమా చారాన్ని తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పాఠశాల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాస్‌బరీ మేయర్‌ మార్క్‌ బౌటెన్‌ తెలిపారు. పాఠశాలలో ఒక్కసారిగా కాల్పులు జరగడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. ఉపాధ్యాయులు కొందరు విద్యార్థులకు సురక్షిత ప్రాంతానికి తరలించారు.