అలిగిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఆదివారం జరుగుతున్న మెట్రో రైలు పనుల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై జైపాల్ అలక వహించారు. అందుకే హైదరాబాద్‌లో ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్లానింగ్ కమిటీని ఒప్పించి ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన తనను నిర్లక్ష్యం చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై కేంద్రమంత్రి అగ్రహోదగ్రులైనట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా. అందరినీ కలుపుకుపోవడమంటే ఇదేనా అని కిరణ్‌కుమార్ రెడ్డిని ఉద్దేశించి సన్నిహితుల దగ్గర జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. జైపాల్, కిరణ్‌ల మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ను రాష్ట్రానికి తీసుకురావడంపై వీరిద్దరి మధ్య కొంతకాలం కిందట మాటల యుద్ధం చోటుచేసుకుంది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి కూడా ఇదే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీద ఫైర్ అయ్యారు. జంటనగరాలకు చెందిన స్థానిక నేతయినప్పటికీ తనను మెట్రోరైలు పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని మర్రి మండిపడ్డారు.



