అసెంబ్లీ ఎందుకు రద్దు చేస్తున్నారో చెప్పాలి
– ఎన్నికలెప్పుడొచ్చినా మేం సిద్ధంగానే ఉన్నాం
– యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగింది
– ప్రశ్నిస్తే రహస్య ఒప్పందం అంటూ దాటవేస్తున్నారు
– వరవరరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం
– విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు29(జనం సాక్షి) : ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీని ఎందుకు రద్దు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని సీఎల్పీ నేత కె. జానారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు తెరాస నేతలు పాల్పడ్డారని జానారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ రోజుకో పథకం పేరుతో ప్రజలను మోసానికి గురి చేస్తున్నారని, కేవలం ప్రకటనలే తప్ప వాటి అమల్లో ఎక్కడా శ్రద్ద లేదని అన్నారు. ప్రజలు కేసీఆర్ మోసాన్ని గ్రహిస్తున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతుందన్నారు. సర్వేల ద్వారా ఈ విషయాన్ని గ్రహించిన కేసీఆర్ ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత రాకముందే ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చిన రాజకీయ పార్టీలు సిద్దంగానే ఉంటాయని జానారెడ్డి అన్నారు. అలాగే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై రహస్య ఒప్పందమంటూ కేంద్ర ప్రభుత్వం సమాధానం దాటవేస్తోందన్నారు. విరసం నేత వరవరరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. మావోయిస్టులతో చర్చల సమయంలో వరవరరావు పోషించిన పాత్ర చాలాగొప్పదన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా అరెస్ట్ చేయడం దారుణమని, వరవరరావుపై వచ్చిన ఆరోపణలపై కేంద్రం విచారణ జరిపించాలన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసేలా పనిచేస్తున్నాయన్నారు.


