ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తారా?
– అక్బరుద్దీన్ తీరు మార్చుకో..
– బీజేపీ నేత కిషన్‌రెడ్డి
హైదరాబాద్,నవంబర్7(జనంసాక్షి): నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, డీఎస్సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది.. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరగా సమాచారమందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై, అక్బరుద్దీన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డీఎస్సీని ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్‌లను ఖండిస్తున్నాంమని, నిరుద్యోగ సమస్యలపై ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా అసెంబ్లీ జరుగుతున్న తీరుపైనా కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సభలో అక్బరుద్దీన్ తీరు దారుణంగా ఉందన్నారు. ఆయన మార్చుకోవాలని కిషన్‌రెడ్డి హితవుపలికారు. ఎంఐఎం చెప్పినట్టు తెలంగాణ అసెంబ్లీ నడుస్తోందని యద్దేవా చేశారు. ప్రబుత్వం ఇప్పటికైనా తను తీరును మార్చుకొని వెంటనే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, తక్షణమే డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.



