‘ఆరోగ్యశ్రీ’పై 8న మరోసారి చర్చలు

హైదరాబాద్‌ : ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు నిలిపివేస్తామని నర్సింగ్‌హోమ్‌లు, స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రకటించిన 24 గంటల్లోనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారి స్పందించారు. అప్నా (ఆంధ్రప్రదేశ్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌), ఆశా (ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌)లతో గురువారం చర్చలు జరిపారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోని వైఎస్సార్‌ భవన్‌లో సుమారు రెండు గంటలకు పైగా ప్రభుత్వానికి, సంఘాలకు మధ్య చర్చలు జరిగాయి.
అనంతరం మళ్లీ సోమవారం చర్చలు జరపాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో శ్రీకాంత్‌ నిర్ణయించారు.
ఈ సందర్భంగా అప్నా, ఆశా సంఘాలు తమ డిమాండ్లను వెల్లడించాయి. ప్రస్తుత ప్యాకేజీ రేట్లను 30 శాతం పెంచాలని, ఏటా 10 శాతం పెంచాలనే డిమాండ్లతోపాటు పలు ఇబ్బందులను ట్రస్ట్‌ సీఈఓ దృష్టికి తెచ్చాయి. ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీమ్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను, అవగాహనా ఒప్పందాలను విడివిడిగా ఇవ్వాలని పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి తెలియజేస్తామని, దీనిపై ఈనెల 8వ తేదీన మళ్లీ చర్చలకు రావాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ వారికి సూచించారు. సమావేశంలో ఆశా అధ్యక్షులు డాక్టర్‌ భాస్కర్‌రావు (కిమ్స్‌), అప్నా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ క్రిష్టప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్టను సవరించకుంటే వైద్యసేవలు నిలిపివేస్తామని చేప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని అప్నా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ క్రిష్టప్రసాద్‌ స్పష్టం చేశారు. చర్చల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే తామేమీ చేయలేమన్నారు.