ఆస్క్ కేటీఆర్‌కు అపూర్వ స్పందన
– ఢిల్లీ తరహాలో సీఎన్‌జీ వాహనాలు
– మంత్రి కె.తారకరామారావు
హైదరాబాద్ 26 జూన్ (జనంసాక్షి):
దిల్లీ తరహాలో హైదరాబాద్‌లోనూ సీఎన్‌జీ ఆటోలు, బస్సులు ప్రవేశపెట్టే యోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట ట్విట్టర్ వేదికగా ఆయన ప్రజల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి పెడుతోందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొత్త ప్రయోగం చేశారు. ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రజలతో నేరుగా అభిప్రాయాలు పంచుకున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు చెప్పారు. వారిచ్చిన సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటల నుంచి మంత్రి పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. మొదట గంటసేపు ఈ కార్యక్రమం ఉంటుందని ప్రకటించినా గంటన్నరకు పైగా ఇది సాగింది.
ముఖ్యంగా ప్రభుత్వ పనితీరు విూద పలువురు అడిగిన ప్రశ్నలకి మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలవిూద నెటిజన్లు పలు సలహాలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన శాంతిభద్రతల చర్యలపై నెటిజన్లు ట్వీట్లతో హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఓటుకి నోటు వ్యవహారంలో చంద్రబాబు అరెస్టుపై చాలామంది ఆస్తకి చూపించారు.
జులైలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. వలసలు తగ్గించేందుకు త్వరలో కొత్త గల్ఫ్ పాలసీని తీసుకొస్తామని కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లోనే కాకుండా వరంగల్, కరీంనగర్ లలో కూడా బీపీవో ఏర్పాటు చేసేందుకు ఒక కంపెనీ ముందుకు వచ్చిందని మంత్రి చెప్పారు.
ప్రభుత్వంతో పనిచేసేందుకు ముందుకు వస్తున్న పౌరుల సేవలను వాడుకునేందుకు క్లౌడ్ సోర్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హుస్సేన్ సాగర్ శుద్ధీకరణ గురించి భయాందోళనలు అవసరం లేదని, ఇలాంటి మంచి ప్రయత్నాలకు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. యువతకి శిక్షణ ఇవ్వడం కోసం టాస్క్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వచ్చే నెలలో టీ-హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీలో ఇతర రాష్ట్రాలతో పోటీ లేదని, ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలో హైదరాబాద్ గూగుల్ స్ట్రీట్ వ్యూ వస్తుందని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ పనులతో పాటు పలువురు అడిగిన వ్యక్తిగత అభిరుచులపైన మంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. విూ అభిమాన హీరో ఏవరని అడిగిన ప్రశ్నకి షారుక్ ఖాన్ అని సమాధానం ఇచ్చారు. తనతో ఫోటో దిగాలనుందన్న శ్రవన్ ని సచివాలయానికి సోమవారం రావాల్సిందిగా ఆహ్వానించారు. తాను సినిమా ప్రియుడినని తెలిపిన మంత్రి, యస్.యస్.రాజమౌళి అద్భుతమైన దర్శకుడని ప్రశంసించారు. మంత్రి ఇలా ట్విట్టర్ ద్వారా ప్రజల ముందుకు రావడాన్ని నెటిజన్లు స్వాగతించారు. ప్రభుత్వ పనితీరుతోపాటు విధానాల రూపకల్పనకి నెటిజన్లు ఇచ్చిన సలహాలకి, స్పందనకి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.




