ఆ రెండు పదవులు ముళ్ల కిరీటాలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంటే ఇలాంటి వ్యాఖ్యలా కిషోర్‌ చంద్రదేవ్‌ లేఖను తప్పుబట్టిన మంత్రి దానం

హైదరాబాద్‌, నవంబర్‌21: పీసీసీ అధ్యక్ష, సీఎం పదవులు రెండూ ముళ్లకిరీటం లాంటివని మంత్రి దానం నాగేందర్‌ పేర్కొన్నారు.  ఈ రెండు పదవులు పొందాలని ప్రతిఒక్కరూ తహతహలాడుతారని, అది సహజం అని అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం, పీసీసీ అధ్యక్షులపై కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ సంధించిన లేఖను తప్పుబట్టారు. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. స్థానిక ప్రజలకు అందుబాటులో లేకుండా కేంద్రమంత్రి కిషోర్‌ ఢిల్లీకే పరిమితమయ్యారని విమర్శించారు. సొంత మనుగడ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీకి నష్టం వాటిల్లేలా చర్యలకు పాల్పడడం కిషోర్‌కు తగదన్నారు. సీఎం, పీసీసీ పదవులు మార్చితే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సొంత విషయాలు ఉంటే అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లాలే తప్ప పత్రికల్లో వచ్చేలా రోడ్డెక్కకూడదని ఆయన హితవు పలికారు. ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టతకు పాటుపడాలేకానీ పార్టీకి నష్టం వాటిల్లే చర్యలకు పాల్పడవద్దని కోరారు. ప్రస్తుత సీఎం, పీసీసీ అధ్యక్షుల పనితీరును తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి కూడా తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు.