ఇరాక్‌లో పేలుడు 52 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లోని ఫ్రాన్స్‌ దౌత్య కార్యాలయం సహా 20కిపైగా ప్రాంతాల్లో ఆదివారం వలస పేలుళ్లు సంభవించాయి. రక్షణ సిబ్బంది సహా 52 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయపడ్డారు. నాస్సిరియాలోని ఫ్రాన్స్‌ దౌత్య కార్యాలయం వద్ద కారుబాంబు దాడిలో గార్డు మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్‌లోని అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దాడుల్లో ఈ నెలలో ఇప్పటి వరకూ 82 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. అమర పట్టణంలో దాడులు, కాల్పుల్లో 16 మంది మృతిచెందగా వందలాది మంది గాయపడ్డారు. దుజైల్‌లో శనివారం అర్ధరాత్రి సైనిక శిబిరంపై జరిగిన దాడిలో 11 మంది సైనికులు మృతిచెందగా ఏడుగురు ఆసుపత్రపాలయ్యరు. ఆదివారం కిర్‌కుక్‌లోని చమురు సంస్థ వద్ద కారుబాంబు దాడిలో ఎనిమిది మంది సిబ్బంది మృతిచెందారు. కిర్‌కుర్‌లో కారు, మోటరు సైకిల్‌ బాంబుల దాడిలో ఏడుగురు మృతిచెందగా 40 మందికి గాయాలయ్యాయి. వీటీతోపాటు బాకుబా, సమర్రా, బస్రా తదితర పట్టణాల్లో నెలకొన్న దాడుల్లో మరికొందరు మృతిచెందారు.