ఈజీఎస్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పేస్కేల్‌ అమలు చేయాలి

 – జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ కి వినతిపత్రం అందించిన ఈజీఎస్‌ సిబ్బందిజనంసాక్షి , మంథని: గ్రామీణ అభివృధ్ది శాఖలో పనిచేస్తున్న ఉపాధి హమీ పథకం కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పేస్కేల్‌ అమలు చేయాలని ఈజీఎస్‌ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు మంథని పట్టణంలోని రాజగృహాలో పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ని మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవలి కాలంలో గ్రామీణాభివృద్ది శాఖలో పనిచేస్తున్న సెర్ఫ్‌ ఉద్యోగులకు ఏప్రిల్‌ మాసం నుంచి పేస్కేల్‌ అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించిందని, తాము అదే శాఖలో పనిచేస్తున్నామని తమకు పేస్కేల్‌ అమలు అయ్యేలా కృషి చేయాలని కోరారు. 2006లో ఉపాధి హమీ పథకం నిర్వహణలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వివిధ హోదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3874 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నామని వారు జెడ్పీ చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈజీఎస్‌లో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పేస్కేల్‌ అమలు జరిగేలా ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేసి తమకు న్యాయం చేయాలని వినతిపత్రంలో ఈజీఎస్‌ సిబ్బంది కోరారు.