ఉగ్రదాడి వెనక పాక్‌ కుట్రలు

గట్టిగా తిప్పికొట్టాల్సిందే: ఆచారి
మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కాశ్మీర్‌లో ఉగ్రదాడితో పాక్‌ కుట్రలు మరోమారు బట్టబయలు అయ్యాయని బిజెపి రాష్ట్రకార్యదర్శి ఆచారి అన్నారు. ఇంతటి ఘాతుకానికి తెగింయచిన పాక్‌కు గట్టి బుద్ది చెప్పాల్సి ఉందన్నారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. జవాన్ల కుటుంబాలకు సానుభూతిని  ప్రకటించారు. ఈ విషయంలో బిజెపి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. కాశ్మీర్‌లో శాంతిని పాదుకొల్పే ప్రయత్నంలో చేస్తున్న పనులను తట్టుకోలేని పాక్‌ ఉగ్రవాదులు అలజడి సృష్టించాలని చూస్తున్నారని, అందుకే దాడికి తెగబడ్డారని అన్నారు. ఇందుకు ప్రధాని మోడీ కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దేశంలో మరోసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీయేనని.. దేశ ప్రజలందరూ కూడా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని ఆచారి  అన్నారు.  దేశం మొత్తం మోడీ చేసిన అభివృద్ధి వైపు చూస్తుందన్నారు. ఐదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడకుండా పాలన సాగిస్తుందన్నారు. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఆగ్రగామిగా నిలిపేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేశారని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీను ప్రజలు ఆదరించలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ ఫథకాలను ప్రజలకు అందించామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 350కి పైగా స్థానాలు గెలుస్తామని ఆయన  ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కుటుంబ పాలన కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.