ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందే

పుల్వామా మృతులకు పలువురు నివాళి
ఆదిలాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు అదిలాబాద్‌ జిల్లాలో పట్టలణ ప్రముఖులు నివాళులు అర్పించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో కార్గిల్‌ అమర వీరుల స్థూపం ఎదుట జవాన్లకు పలు యువజన సంఘాలు, శ్రద్దాంజలి ఘటించారు. అదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనీషా సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రంగినేని మనీషా మాట్లాడారు. మనదేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసే జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఉగ్రవాదులను ఏరిపారేయడంలో కఠినంగానే ఉండాలన్నారు. వారిపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపాల్సిన అసవరం లేదన్నారు.  వారి త్యాగం వృధాపోదని.. అమరులైన జవాన్ల కుటుంబాలు దేశంలోని ప్రతి పౌరుడు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.