ఉత్తమ విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే

హైదరాబాద్‌ : వికలాంగులకు, వెనుకబడిన తరగతుల వారికి ఉత్తమ విద్య నందించటంలో వైషమ్యాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని బ్రిటిష్‌ కౌన్సిల్‌ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి రాబ్‌లైన్స్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో మూడో అంతర్జాతీయ ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల సదస్సును ఆయన ప్రారంభించారు. వికలాంగులు. వెనుకబడిన, మైనార్టీ, షెడ్యూల్‌కులాల వారికి సమాన విద్యాబోధన అందేలా చర్యలు చేపట్టాలనేది భారత జాతీయ ప్రణాళికలో పొందుపరచినట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాల విద్య అనేది అన్ని వర్గాల పిల్లలకూ వర్తిస్తుందన్న అంశాన్ని మర్చాపోకూడదని సూచించారు. విద్యార్థులు ఆంగ్లభాషలో ప్రావీణ్యం సంపాదించేలా చేయటంలో ప్రభుత్వ పాఠశాలలు విఫలమవుతున్నాయన్నారు. ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్ల భాషలోనూ విద్యార్థులు రాణించేలా చూడాల్సిన బాధ్యత ఆంగ్ల ఉపాధ్యాయులదేనని రాబ్‌లైన్స్‌ అన్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది.