కంటతడి పెట్టిన పయ్యావుల కేశవ్‌

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ సీనీయర్‌ నాయకుడు, అనంతపూర్‌ జిల్లా ఉరవకొండ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్‌ మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కంటతడిపెట్టారు. తాను వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు మంగళవారం కొన్ని దినపత్రికల్లో వచ్చిన కథనాలపై కేశవ్‌ ఇలా భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఏ పార్టీలో చేరబోవడం లేదని తేల్చిచెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని అన్నారు. మీడియా వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీ పునాదులపై ఎదిగానో ఆ పార్టీని ఎలా వీడతానని ప్రశ్నించారు. జగన్‌ తండ్రితో పోరాటం చేసిన తాను వైఎస్సార్‌సీపీలో చేరే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పారు. ఆ పార్టీ వ్యూహాత్మకంగా తెలుగుదేశంలోని కీలక నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే ఇలాంటి నీచ రాజకీయాలకు తాను లొంగబోనని మరింత ఉత్సాహంగా తెలుగుదేశం కోసం ఓ సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. తాను డబ్బుకోసం రాజకీయాలలోకి రాలేదని, ఎన్టీఆర్‌ పిలిచి టికెట్‌ ఇస్తే ప్రజాసేవ చేసేందుకు వచ్చానని చెప్పారు. ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టీడీపీ నాయకులు ఈ వార్తలను పుట్టించారని అన్నారు. ఏ ఆధారాలతో ఇలా ప్రచారం చేస్తున్నారో చెప్పాలని కేశవ్‌ సవాల్‌ విసిరారు. ఎప్పుడూ దూకుడుగా టీడీపీ వ్యతిరరేక పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించే కేశవ్‌ ఇలా భావోద్వేగంతో మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేసింది.