కిరణ్‌ సర్కారుకు మరో షాక్‌

ధర్మాన, మోపిదేవిల ప్రాసిక్యూషన్‌కు సీబీఐ కోర్టు అనుమతి
హైదరాబాద్‌,జనవరి 21(జనంసాక్షి):
మంత్రి ధర్మాన ప్రసాద రావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణలకు సి.బి.ఐ. కోర్టులో చుక్కెదురైంది. వీరిద్దరి ప్రాసిక్యూషన్‌కు అనుమతినిస్తూ కోర్టు సోమవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. దీంతో  మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా అనివార్యమవుతుందని భావిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టం క్రింద ధర్మాన, మోపిదేవిల ప్రాసిక్యూషన్‌కు అనుమ తిస్తున్నట్టు- సి.బి.ఐ. కోర్టు సోమవారం నాడు తమ కోర్టులో స్పష్టం చేసింది, వాన్‌పిక్‌ కేసులో ఈ నెల 31 వ తేదీన హాజరు కావాలని సమన్లు జారీ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ మంత్రి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి కావాలని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైలును ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్‌కు పంపించగా ఆయన పునఃపరిశీలించవలసిందిగా ఆ ఫైలును తిరిగి ప్రభుత్వానికి పంపించిన విషయం తెలిసిందే.కాగా ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతినా దాన్ని ఆమోదించకుండా సిఎం క ఇరణ్‌ తొక్కిపెట్టారు.  కోర్టు సోమవారంనాడు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ సర్కారుకు పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల మేర నష్టం కలిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సి.బి.ఐ. దాఖలు చేసిన కేసును విచారణకు స్వీకరించిన అనంతరం ఇచ్చిన ఈ తీర్పు వల్ల ఇప్పటివరకూ ధర్మాన రాజీనామా విషయంలో సాచివేత ధోరణికి పాల్పడిన ప్రభుత్వం ఇక ఎంతమాత్రం ఆలస్యం చేసినా పార్టీ అధిష్ఠానం వద్ద కూడా తీవ్ర విమర్శలకు గురి కావచ్చు. వారిద్దరి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదనే సిబిఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. అవినీతి నిరోధక చట్టం కింద ఆ ఇద్దరిని సిబిఐ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే మోపిదేవి వెంకటరణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు రాజీనామాను నైతిక దృష్టితో ఆమోదించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ధర్మాన ప్రసాదరావు రాజీనామాను తిరస్కరిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానం చేసి, ఈ మేరకు ఫైల్‌ను గవర్నర్‌ నరసింహన్‌కు పంపించింది. అయితే, దాన్ని మరోసారి పరశీలించాలని గవర్నర్‌ ఆ ఫైల్‌ను వెనక్కి పంపించారు. దానిపై ప్రభుత్వం గానీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గానీ ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్‌కు సిబిఐ కోర్టు అనమతించడంతో ప్రభుత్వం అత్మరక్షణలో పడింది. ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించకపోవడంపై ఇప్పటికే పలు వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యతిరేకతను  ఎదుర్కుంటున్నారు. మోపిదేవికి ఓ న్యాయం, ధర్మానకు మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ స్థితిలో ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించకతప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైయస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రెవెన్యూ మత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్‌ సంస్థలకు మేలు చేస్తూ ధర్మాన ప్రసాదరావు నిర్ణయం తీసుకున్నారని సిబిఐ అభియోగం మోపింది.