కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న సమాచార కమిషన్
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల సారధులు, సభ్యుల నియామకాల్లో మార్పులు సూచిస్తు సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం వెలువరించిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ ) వెల్లడించింది. అప్పటి వరకూ యధావిధిగా విధులు కొనసాగించనున్నట్లు తెలిపింది. సమాచార హక్కు చట్టానికి మార్పులు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే కనుక ప్రభుత్వం నుంచి అధికారికంగా నిర్ణయం వెలువడే వరకూ యేచి ఉండటమే సముచితమని సమావేశంలో కమిషనర్లు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ సత్యానంద్ మిశ్రా అధ్యక్షతన దాదాపు గంట సమయం పాటు వీరి భేటీ కొనసాగింది. న్యాయస్థానాల్లో మాదిరిగానే సమాచార కమిషన్లలోనూ ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని, ధర్మాసనంలో ఉండే ఇద్దరు సభ్యుల్లో ఒకరికి న్యాయ విధులు సక్రమంగా నిర్వర్తించే సామర్థ్యం ఉండాలని తన ఆదేశాల్లో ధర్మాసనం స్పష్టం చేసింది.



