కేసీఆర్‌లాంటి అహంకారపూరిత సీఎంను ఎక్కడా చూడలేదు

– ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– తెరాసను గద్దెదింపేందుకు అన్ని పార్టీలు ఏకంకావాలి
– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌
హైదరాబాద్‌,నవంబర్‌4(జ‌నంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హనుమంతరావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నూతన సచివాలయం నిర్మించి తీరుతానన్న కేసీఆర్‌ లాంటి అహంకారపూరిత సీఎంను ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెరాస హయాంలో ప్రజలకు ఒరిగింది ఏవిూ లేదన్నారు. రోజుకో హావిూ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకే కేసీఆర్‌ ప్రాధాన్యతనిస్తున్నాడని, క్షేత్రస్థాయిలో ప్రజల మేలు కోరి పాలన సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలోకి వచ్చిన మూడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెరాస అధికారంలోకి వస్తే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపిన కేసీఆర్‌ ఇప్పుడెన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌ తన మాటలగారడితో మోసం చేస్తున్నాడని విమర్శించారు. రైతుల జపం చేస్తూ రైతులపైనే కేసులు పెట్టే ఘనత కేసీఆర్‌ ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కుటుంబం ప్రజల్ని దోచుకుంటుందని అన్నారు. టీఆర్‌ఎస్‌ను గద్దెదించేందుకు అన్ని పార్టీలు ఏకంకావాలని పిలుపునిచ్చారు. స్థానిక నేతల సలహాలతో కొత్తవారిని పార్టీలోకి తీసుకొవాలని అన్నారు.