కేసీఆర్‌ కిట్‌ పథకం అద్భుతం

– ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది
– ఇప్పటి వరకు 95వేల కిట్లను పంపిణీ చేశాం
– శాసనమండలిలో మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్‌, నవంబర్‌7(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకం అద్భుతమని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో కేసీఆర్‌ కిట్‌ పథకంపై చైర్మన్‌ స్వామిగౌడ్‌ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. గర్భిణీలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ. 13 వేలు ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ తల్లీబిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. మెటర్నరీ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలను మెరుగుపర్చామని చెప్పారు. అమ్మ ఒడి అంబులెన్స్‌లు గర్భిణీల ప్రాణాలను కాపాడుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 95 వేల కిట్లను పంపిణీ చేశామన్నారు. త్వరలోనే కేసీఆర్‌ కిట్ల పంపిణీ లక్షకు చేరుకుంటుందన్నారు. ఈ కిట్‌ కోసం రూ. 92 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాసుపత్రుల్లో 98 వేల ప్రసవాలు జరిగాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి నెల డెలివరీల సంఖ్య పెరుగుతుందని మంత్రి చెప్పారు.